తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా ఉండడమే దాని ప్రథమ కర్తవ్యం. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే కేవలం గులాబీ జెండా పార్టీది కాదు, తెలంగాణ పండుగ. రజతోత్సవ సభకు ప్రతి ఊరూ కదలాలి. ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలి.
– కల్వకుంట్ల కవిత
జగిత్యాల, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే తెలంగాణ పండగ అని, ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ జాతరకు జగిత్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. 27న ఉదయం గ్రామగ్రామానా గులాబీ జెండాను ఎగురవేసి వరంగల్ సభకు కదలిరావాలని కోరారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై, దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం చాటేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని, ఇరవై ఐదేండ్ల కాలంలో కాల పరీక్షకు నిలిచి, తెలంగాణ ప్రజలకు విశ్వ వేదికపై ప్రత్యేక గుర్తింపును తెచ్చిందని ఉద్ఘాటించారు. పార్టీ తొలి పధ్నాలుగేండ్ల కాలంలో ఉద్యమం ద్వారా స్వరాష్ర్టాన్ని సాధిస్తే, తర్వాత పదేళ్ల కాలంలో తెచ్చిన రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు.
కేసీఆర్ నేతృత్వంలో ఎక్కడా అమలు కాని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాష్ట్రంలో అమలు చేసి, ప్రపంచం నెవ్వరపోయేలా చేశారని ప్రశంసించారు. బీఆర్ఎస్ పుట్టక ముందు తెలంగాణ సంస్కృతి, భాష యాసకు గుర్తింపు, గౌరవం లేదని, బీఆర్ఎస్ పెట్టాకే వైభవం ప్రాభవం వచ్చాయన్నారు. 2001లో పుట్టిన పార్టీ అనేక ఒడిదొడుకులను తట్టుకొని నిలబడిందని, సగర్వంగా రజతోత్సవం చేసుకుంటున్నామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని, అలాగే ప్రైవేట్ బస్సులను సైతం హైర్ చేసుకుంటున్నామన్నారు. సభా స్థలికి నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకోవాలని, సభలో కేసీఆర్ చెప్పే మాటలు విని, వాటిని గ్రామాల్లో ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలను కాపాడేది బీఆర్ఎస్సే
బీఆర్ఎస్ హయాంలో వరద కాలువ జీవనదిలా ఉండేదని ఇప్పుడు ఎండిపోయి వట్టిపోయి కనిపిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వరద కాలువ నిండుగా ఉంటే సాగుకు, తాగుకు ఇబ్బంది లేకుండా ఉండేదని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం వరద కాలువలో నీరు లేకుండాపోవడంతో ఎగువన ఉన్న కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి, మల్యాల లాంటి మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వరద కాలువలో నీరు ఉంటే రైతులు దానికి కరెంట్ మోటర్లు పెట్టుకుంటే ఇబ్బందులు పెట్టవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ పూర్వపు కాంగ్రెస్ పాలన రోజుల వచ్చాయన్నారు. తెలంగాణను, రాష్ట్ర ప్రజలను కాపాడేది బీఆర్ఎస్ పార్టేనని అన్నారు. ఇతర పార్టీలు చెప్పే మాయమాటల గురించి ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి గ్రామ కమిటీలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని ఆమె కోరారు.
బీఆర్ఎస్ గ్రామ, పట్టణ కమిటీల్లో యువతకు, మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం మహిళ రిజర్వేషన్ ఉంటుందని, అలాగే అసెంబ్లీ స్థానాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయని, మహిళలను ప్రోత్సహించాల్సిన అసవరం ఉందన్నారు. అనంతరం వరంగల్ సభ కోసం బీడీ కార్మిక మహిళలతో కలిసి మౌనిక 5వేలను విరాళంగా అందజేశారు.
సమావేశంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి రమణరావు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వొద్దినేని హరి చరణ్‌రావు, నాయకులు గట్టు సతీశ్, కొండపల్కల రాంమోహన్‌రావు, దావ సురేష్, తురగ శ్రీధర్ రెడ్డి, దేవేందర్ నాయక్, ఆవారి శివ కేసరి బాబు, సమిండ్ల శ్రీనివాస్, వొల్లెం మల్లేశం, మాజీ ప్రజాప్రతినిధులు, అశ్విని, సంధ్య, శీలం ప్రియాంక, మానాల కిషన్, సోషల్ మీడియా ఇన్చార్జి తాండ్ర సుధీర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సంజయ్ ప్రజలను వంచించిండు
బీఆర్ఎస్ నుంచి పోయిన వారు పోతారని, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. నది ప్రవాహం కొనసాగుతూనే ఉంటుందని, తన ప్రవాహంలో నుంచి తప్పిపోయిన నీటి కోసం నది వెనిక్కి తిరిగి రాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పాతవారు వెళ్లిపోతే, కొత్తవారు వచ్చిచేరుతూనే ఉంటారని, పోయిన వారు తిరిగి వచ్చినా తీసుకునే ప్రసక్తి లేదన్నారు. 2014లో ఎమ్మెల్యే బీఫాం ఇచ్చి ప్రోత్సహిస్తే డాక్టర్ సంజయ్‌కుమార్ ఓడిపోయారని, అయినా ఆయన వెంట ఉండి 2018, 2023లో గెలిపించామన్నారు.
ఆయన గెలుపు కోసం అహర్నిషలు కృషి చేశామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజీ ఏర్పాటు, బోర్నపెల్లి వంతెన, హైదరాబాద్ తదుపరి 4,500 డబుల్ బెడ్రూం ఇండ్లను జగిత్యాలకు కేటాయింపజేశామన్నారు. సంజయ్‌కుమార్ జగిత్యాల కోసం ఏ పని అడిగితే ఆ పనిని కేసీఆర్‌కు, కేటీఆర్‌కు చెప్పి మంజూరు ఇప్పించానన్నారు.
అంతగా మద్దతు పలికితే పార్టీకి ద్రోహం చేసి, గెలిపించిన ప్రజలను వంచించి పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయాడన్నారు. ఎమ్మెల్యే సంజయన్న మైనార్టీలకు తోఫాను ఊడగొట్టినందుకు పోయాడో.. మరెందుకు పోయాడో తెలియడం లేదన్నారు. పైసల కోసం పోయాడని అందరూ అంటున్నారని విమర్శించారు. 136 కోట్లు వెచ్చించి రోళ్లవాగు ప్రాజెక్టు కట్టించామని, కానీ, కాంగ్రెస్ పద్దెనిమిది నెలలుగా దానికి కనీసం షట్టర్ పెట్టలేకపోతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ప్రజలపై ప్రేమలేదని, అందుకే పార్టీ మారాడని విమర్శించారు.
రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే, అందులో పనితీరు ప్రకారం చూస్తే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు 108 స్థానం వచ్చిందంటేనే ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. పార్టీ మారినప్పటి నుంచి జగిత్యాల ఎమ్మెల్యే అసెంబ్లీలో కనిపించింది లేదని, మాట్లాడింది లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఇటీవల ఒక రోజు టీవీ చూస్తుంటే, అర్వింద్‌తో సంజయన్న కనిపించారని, ఆయన కాంగ్రెస్‌లో చేరాడా..? బీజేపీలో చేరాడో కాసేపు అర్థం కాలేదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియడం లేదని, ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారన్నారు. జగిత్యాలకు నిధులు తేవడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలమయ్యారని, ఆయనను గ్రామగ్రామానా ప్రజలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రభుత్వంపై పిడికిలి బిగించాలి
కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పిడికిలి బిగించి పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. వరంగల్ బహిరంగ సభ అత్యంత కీలకమైనది. పాతికేళ్ల కాలంలో పార్టీ చేసిన గొప్ప పనులు, సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నింటినీ అధినేత కేసీఆర్ వివరిస్తారు. పదేళ్ల అభివృద్ధి పథంలో సాగిన రాష్ట్రం, కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నది. దొంగమాటలతో, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను వంచిస్తున్నది. పార్టీ శ్రేణులు పార్టీకి పునరంకితం కావాలి. కాంగ్రెస్ తప్పుడు విధానాలపై, హామీలపై పోరాటానికి సిద్ధం కావాలి. కేసీఆర్‌ను సీఎంగా చేసే వరకు విశ్రమించవద్దు. వరంగల్ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉన్నది.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
పెద్ద సంఖ్యలో తరలిస్తాం
బీఆర్ఎస్ పండుగే తెలంగాణ పండుగ. రజతోత్సవ సభకు జగిత్యాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిస్తాం. జగిత్యాల నియోజకవర్గంలో అనేక అవమానాలు ఎదురైనా.. కేసీఆర్, కవిత చెప్పారని ఎమ్మెల్యేగా సంజయ్‌కుమార్‌ను గెలిపించుకున్నాం. అయితే ఆయన పార్టీకి వెన్నుపోటు పొడవడం బాధాకరం. ఆయన పార్టీ మారడమే గాక.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు పనులు, డబ్బులు ఆశచూపి పార్టీ పిరాయింప చేశాడు. కానీ, కార్యకర్తలు, నాయకుల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పోగు చేసి పార్టీని కాపాడుకుంటున్నాం. కవితక్క జగిత్యాలలో పాదయాత్ర చేసి, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాలి.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్పర్సన్
అన్నం పెట్టిన కేసీఆర్‌ను మరిచిపోం
కేసీఆర్, కవితక్క బీడీ కార్మికుల మంచి చెడ్డలు చూసిన్రు. అడుగక ముందే మా గురించి ఆలోచించిన్రు. నెలకు వెయ్యిరూపాయల జీవన భృతి అందించిన్రు. తర్వాత దాన్ని రెండువేలకు పెంచిన్రు. కేసీఆర్ చూపిన దయతో లక్షలాది మంది బీడీ కార్మికులకు మేలు జరిగింది. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మేం మరిచిపోం. అందుకే బీడీ కార్మికుల పింఛన్‌ను నుంచి ఐదువేల రూపాయలు విరాళంగా ఇస్తున్నం. మళ్లీ త్వరలోనే కేసీఆర్ రాజ్యం రావాలి.
– మౌనిక, బీడీ కార్మికురాలు, పోచంపేట (సారంగాపూర్)
తప్పుడు హామీలపై నిలదీయాలి
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. అబద్ధపు హామీలతో మోసపూరితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజలను అరిగోస పెడుతున్నది. ఆ పార్టీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పదేండ్లు వెనక్కి పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు. కానీ, కాంగ్రెస్ మాటలు విని ఇప్పుడు ప్రజలు గోసపడుతున్నారన్నారు.
కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష. కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హమీలపై గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిలదీయాలి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు, మోసాలపై పోస్టులు పెడితే పోలీసులు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టిన సమయంలో కార్యకర్తలు, నాయకులు సమష్టి ప్రభుత్వంపై ఉద్యమించాలి. పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు. కార్యకర్తల నుంచే నాయకులు పుట్టుకొస్తారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి. భవిష్యత్తు బీఆర్ఎస్దే.
– కొప్పుల ఈశ్వర్, మాజీమంత్రి
గులాబీ జెండా ఎగురవేసి తీరుతాం
తప్పుడు హామీలతో రాష్ట్ర ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్, బీజేపీని విశ్వసించే పరిస్థితి లేదు. రాబోయే రోజులు బీఆర్ఎస్వే. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. గులాబీ జెండాపై, కేసీఆర్‌పై నియోజకవర్గ ప్రజలకు అచంచల విశ్వాసం ఉన్నది. 2028లో జగిత్యాల నియోజకవర్గంతోపాటు నిజమాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేసి తీరుతాం. జగిత్యాల నియోజకవర్గ ప్రజల్లో ధృడవిశ్వాసం కల్పించేందుకు ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేయాలి. కార్యకర్తలు, నాయకులు రజతోత్సవ సభకు తరలిరావాలి. అధినేత కేసీఆర్ చెప్పే మాటలు విని ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలి.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ