ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయని దద్దమ్మ ఈటల రాజేందర్ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకమని, ఉప ఎన్నికలో గెలిచి తొమ్మిది నెలలైనా నియోజకవర్గంలో లక్ష రూపాయల పని చేయలేదని మండిపడ్డారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే బహిరంగ చర్చకు రాలేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ చర్చా వేదికపైకి టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ నిర్ణీత సమయానికే చేరుకున్నారు. కానీ, స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖం చాటేశారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఎమ్మెల్సీ అక్కడే వేచి ఉన్నా రాకపోవడంతో వేదికపై ఈటల కోసం వేసిన కుర్చీకి పూలమాల వేసి సన్మానం చేశారు. అనంతరం రాజేందర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకొనే ఈటల చర్చకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆయన రాలేదంటే అభివృద్ధి చేయలేదని ఒప్పుకొన్నట్టేనన్నారు. అంబేద్కర్ సాక్షిగా మరో సవాల్ విసురుతున్నానని, కేంద్రం నుంచి ఆయన వంద కోట్లు తెస్తే.. తాను రాష్ట్రం నుంచి 150 కోట్ల తెస్తానని స్పష్టం చేశారు.
కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఈటల రాజేందర్ ఎక్కడో హైదరాబాద్‌లో బీజేపీ ఆఫీసులో కూర్చొని అబద్ధాలు మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. 18 ఏండ్ల తన రాజకీయ జీవితంలో ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే ఆయన చర్చకు రాలేదని ధ్వజమెత్తారు. శుక్రవారం ఉదయం హజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ చర్చా వేదికగా రాజేందర్‌పై ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ చేసిందేమిటో చెబుతానని, హుజూరాబాద్ నియోజకవర్గంలో 10 లక్షలకు కూడా కేసీఆర్ జీవో ఇవ్వలేదని చెప్పిన ఈటలకు 100 కోట్లు ఇచ్చిన జీవోలతో సహా కౌశిక్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పుకునే రాజేందర్ తన సవాల్‌ను స్వీకరించి ఈ రోజు ఇక్కడికి చర్చకు ఎందుకు రాలేదని నిలదీశారు. ఆయన చర్చకు రాలేదంటే అభివృద్ధి చేయలేదనే స్పష్టంగా తెస్తున్నదన్నారు. రెండున్నరేండ్లుగా మంత్రిగా ఉంటున్న గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గాన్ని వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, రాజేందర్ ఏడున్నరేండ్లు మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లోని సూపర్‌బజార్ రోడ్డు వేయమని స్థానికులు దండం పెట్టినా లెక్క చేయలేదని, అదే సీఎం దృష్టికి వెళ్లగానే నిధులు మంజూరు చేసి రోడ్డు వేయించారని గుర్తు చేశారు. హుజూరాబాద్ నుంచి సైదాపూర్ వెళ్లే రోడ్డు, విద్యానగర్ రోడ్డు వేయమని అడిగితే వేశావా..? అని, చివరికి తన ఇంటికి వెళ్లే రోడ్డు కూడా వేయించలేని అసమర్థుడు ఈటల అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లగానే జీవో నంబర్ 295 ద్వారా 6 కోట్ల నిధులు ఇచ్చి అద్దంలాంటి రోడ్డు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్నట్లుగా వ్యవహరించిన ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తన సొంత ఊరు కమలాపూర్‌లో ఒక బస్టాండ్ కూడా కట్టించలేక పోయాడని, ఇప్పుడు 2 కోట్లతో సీఎం కేసీఆర్ బస్టాండ్ నిర్మాణం చేపట్టారని చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక వైద్యాధికారి పోస్టును కూడా మంజూరు చేయించుకోలేక పోయాడన్నారు. కనీసం ఒక శ్మశాన వాటిక కూడా కట్టించ లేదని ధ్వజమెత్తారు.
ఈటలకు కావాల్సింది ఓట్లు, రాజకీయాలు
ఈటలకు రాజకీయాలు, ఓట్లు కావాలే తప్ప హుజూరాబాద్ అభివృద్ధిపై పట్టింపు లేదని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలిచి తొమ్మిది నెలలు గడుస్తున్నా లక్ష విలువైన అభివృద్ధి అయినా చేశావా..? అని నిలదీశారు. హుజూరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరో సవాల్ విసురుతున్నానని, రాజకీయాలు వద్దు.. హుజూరాబాద్ అభివృద్ధి కావాలని కోరుకుంటే కేంద్రం నుంచి వంద కోట్లు తీసుకురావాలని, తాను రాష్ట్రం నుంచి మరో 150 కోట్లు తెస్తానని స్పష్టం చేశారు. తన్నుకునుడు, గుద్దుకునుడు కాదు.. అభివృద్ధిలో పోటీ పడుదామని, కనీసం ఈ సవాలైనా స్వీకరించాలని సూచించారు.
చెడుగా మాట్లాడితే ఢిల్లీ దాకా ఉరికిస్తాం
సీఎం కేసీఆర్ గురించి చెడుగా మాట్లాడితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉరికిస్తాం ఖబడ్దార్ అని ఈటలను హెచ్చరించారు. కేసీఆర్‌ను తిడితే ఎవరినీ వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌ను జిల్లా చేసుకునే అవకాశమున్నా ఆయన అసమర్థతతో అది సాధ్యం కాలేదని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ జిల్లా కావాలని కొందరు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో దీక్షలు చేస్తే అవి అర్థం లేని, నీతి లేని దీక్షలని ఆనాడు హేళన చేశారని గుర్తు చేశారు.
మెడికల్ కాలేజీ, ఫార్మా కంపెనీలు ఇక్కడెందుకు పెట్టలేదు
ఈటల అక్రమ సొమ్ముతోని హైదరాబాద్‌లో మెడికల్ కళాశాల, ఫార్మా కంపెనీలు పెట్టుకున్నారని, అయితే అవి హుజూరాబాద్‌లో ఎందుకు పెట్ట లేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. తాను ఆయన స్థాయి వాడిని కాదని, తనతో చర్చకు రానని చెప్పిన ఈటల.. 18 ఏండ్లు ఎమ్మెల్యేగా, ఏడున్నరేండ్లు మంత్రిగా ఎట్ల పని చేశావో..? అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీగా ఉన్న తాను ఆయన కంటే ఒకింత పెద్దోన్నే తప్పితే, ఆయన కంటే చిన్నోన్ని కాదని స్పష్టం చేశారు. వాస్తవంగా తనకంటే పదవిలో చిన్నోడైన ఈటలతో తాను చర్చకు రావద్దని, కానీ తాను హుజూరాబాద్ బిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగానని, అయినా ఈటల తన సవాల్‌ను స్వీకరించ లేదన్నారు.
ఆత్మగౌరవం ఎటుపోయింది?
ఈటల రాజకీయ చరిత్ర 18 ఏండ్లయితే తమ నేత కేసీఆర్ రాజకీయ చరిత్ర 40 ఏండ్లని, తనను ఒక పిల్లగాడు అన్నప్పుడు కేసీఆర్ ముందు ఈటల ఏంటని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ గురించి మాట్లాడేంత పెద్దోడివి అయ్యావా..? అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా గెలిచే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని, ఈటల ఆయన కాలిగోటికి కూడా సరిపోడని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఒక కార్పొరేటర్ స్థాయి నాయకుని కింద పని చేస్తున్న ఈటల ఆత్మగౌరవం ఎటు పోయిందని నిలదీశారు. ‘ఉప ఎన్నికలప్పుడు సాదుకుంటరా.. చంపుకుంటరా..’ అని దొంగ ఏడుపులు ఏడిస్తే ఓట్లు వేశారని తెలిపారు. హుజూరాబాద్ నుంచే కాదు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని బీరాలు పలికితే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ పోటీ చేస్తామని చెప్పడానికి వీలు లేదని, అదంతా అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పి ఈటలను ఒక జోకర్ కింద ట్రీట్ చేశారని ఎద్దేవా చేశారు. దేశంలో 29 రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో బ్రోకర్ పని చేస్తేనే రాజేందర్‌ను చేరికల కమిటీకి చైర్మన్‌గా బీజేపీ చేసిందని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను అన్నట్లుగానే ఈ వేదిక నుంచి తాము రాజేందర్‌ను అరేయ్ తురేయ్ అనవచ్చని, కానీ అది తమ సంస్కారం కాదని, తమ నాయకుడు కేసీఆర్ అని, ఇకనైనా సంస్కారవంతంగా మారాలని హితవు పలికారు.
అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకం
రాజేందర్ ఘాతుకాలను ప్రశ్నించిన దళితులను కొట్టించి, వారిపై రౌడీ షీటర్లు ఓపెన్ చేయించారని, ఈటల ఒక సైకోలా, ఒక చిల్లరగాడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితేనే నాయకుడైన ఈటల.. అన్నం పెట్టినోడికే సున్నం పెట్టే రకమని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో లొల్లీలు పెట్టించి తనను ఒక రౌడీ కింద చిత్రీకరించాలని ఈటల అనుకున్నారని, తాను రౌడీయిజం చేయలేదని, తాను చేసే పోరాటం హుజూరాబాద్ అభివృద్ధికి తప్పితే మరోదానికి కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్స్న్ కనుమల్ల విజయ, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సన్లు గందె రాధిక, తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమా నాయక్, నాయకులు సొల్లేటి కిషన్ రెడ్డి, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, మాడ సాదన రెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, సంపంగి రాజేందర్ పాల్గొన్నారు.
ముఖం చాటేసిన ఈటల
హుజూరాబాద్ వేదికగా ఈటల రాజేందర్ గతనెల 30న ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్క పైసా గానీ, ఒక్క జీవో గానీ ఇవ్వలేదంటూ ఈటల చేసిన విమర్శలను అదే రోజు తిప్పికొట్టారు. హుజూరాబాద్ ప్రగతికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్లు, నిధుల వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. అంతేకాదు, ‘నీవు ఏం చేశావో.. సీఎం కేసీఆర్ ఏం చేశారో.. ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో.. ఈ నెల 5న హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ప్రజల ముందు తేల్చుకుందాం రా..’ అంటూ సవాల్ విసిరారు. సవాల్ విసిరినట్లుగానే ఎమ్మెల్సీ శుక్రవారం ఉదయం హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చర్చా వేదికకు ర్యాలీగా తరలివచ్చారు. నిర్ణయించిన సమయానికి అంటే ఉదయం 11 గంటలకే అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. కానీ, ఈటల రాజేందర్ అక్కడికి రాలేదు. కొంత మంది బీజేపీ నాయకులు వచ్చి కవ్వించే ప్రయత్నం చేయగా.. టీఆర్ఎస్ నాయకులు తిప్పి కొట్టారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంట పాటు అక్కడే వేచి ఉన్న కౌశిక్‌రెడ్డి చర్చా వేదికపై ఎమ్మెల్యే రాజేందర్ కోసం వేసిన కుర్చీకి పూల మాల వేసి సన్మానం చేశారు. అనంతరం రాజేందర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవిగో 100 కోట్ల జీవోలు
కేసీఆర్ అంటే దమ్మున్న నాయకుడు. ఈటల అభివృద్ధి చేతగాని దద్దమ్మ. హుజూరాబాద్ అభివృద్ధికి సీఎం ఏం చేయలేదని రాజేందర్ అంటున్నడు. 10 లక్షల జీవో చూపించు అన్నడు. కానీ, నేను సీఎం కేసీఆర్ ఇచ్చిన 100 కోట్ల జీవోలు చూపుతున్న. జీవో నంబర్ 254 100 కోట్ల ఎస్డీఎఫ్ నిధులను ఇచ్చిండు. అందులో కమలాపూర్‌కు 20 కోట్లు, ఇల్లందకుంటకు 10 కోట్లు, జమ్మికుంట మండలానికి 10 కోట్లు, జమ్మికుంట పట్టణానికి 15 కోట్లు, హుజూరాబాద్ మండలానికి 15 కోట్లు, హుజూరాబాద్ పట్టణానికి 15 కోట్లు, వీణవంక మండలానికి 15 కోట్లు ఇచ్చిన్రు.
– ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి