కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదుకు గడువు ముంచుకొస్తున్నది. ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం మరో 48 గంటల్లో ఈ సమయం ముగియనున్నది. అయితే ఈ రెండు స్థానాలకు ఆశించిన స్థాయిలో ఎన్రోల్మెంట్ జరుగలేదని తెలుస్తున్నది. బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు, ఇదే సమయంలో 15 జిల్లా అధికారులు ఓటర్ నమోదుపై అవగాహన కల్పిస్తున్నా.. అంచనాలకు అనుగుణంగా నమోదు ప్రక్రియ జరగడం లేదు. 2019 ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల స్థానంలో ఈ సారి దరఖాస్తుల సంఖ్య పెరిగినట్టు కనిపిస్తున్నా.. మరింత పెరగాల్సిన అవసరమున్నది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో గతంలో కన్నా ఈసారి తక్కువ ఓటర్ నమోదైంది. ఔత్సాహిక అభ్యర్థులు ఎవరికి వారే ఓటర్ నమోదును పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గడువు పెంచాలంటూ విజ్ఞప్తులు వస్తుండగా, ఎన్నికల సంఘం మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
కరీంనగర్, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్-మెదక్, నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి గెలుపొందిన అభ్యర్థుల పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనున్నది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, రెండు స్థానాలకు ఎన్రోల్మెంట్ ప్రక్రియను చేపట్టింది. ఇది ఈ నెల 6వ తేదీతో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నాటికి జరిగిన ఓటర్ ఎన్రోల్మెంట్ చూస్తే.. రెండు స్థానాలకు ఆశించినంతగా జరగలేదు. 2019లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగిన సమయంలో 17 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అప్పుడు 1,96,321 మంది ఓటు నమోదు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లోనే చాలా మంది పట్టభద్రులు తమ పేర్లను నమోదు చేసుకోలేదు.
ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. గడిచిన ఐదేళ్లలో కొత్తగా లక్షలాది మంది విద్యార్థులు పట్టాలు పుచ్చుకున్నారు. ఈ సారి ఓటరు నమోదు గడువు ముగిసే నాటికి సుమారు 3 నుంచి 3.50 లక్షలకు ఎన్రోల్మెంట్ పెరుగుతుందని అధికారులు అంచనాలు వేశా రు. సోమవారం మధ్యాహ్నం వరకు చూస్తే ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని 15 జిల్లాల్లో 2,35,576 మంది పట్టభద్రులు తమ ఓటు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అందులో 2,34,241 ఆన్లైన్, 1,335 ఆఫ్‌లైన్ దరఖాస్తులొచ్చాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల స్థానంలో కొంత మేరకు ఓటర్ ఎన్రోల్మెంట్ పెరిగినట్టు కనిపిస్తున్నా ఆశించిన స్థాయిలో జరగలేదు. అంతేకాదు, ఈ సారి ఓటర్ నమోదు ప్రక్రియను పెంచేందుకు ఈస్థానంలో పోటీ పడుతున్న చాలా మంది అభ్యర్థులు తమ సొంత ప్ర యత్నాలు చేశారు. ఎవరికి వారే కొంత మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి.. మిస్డ్ కాల్ చేస్తే చాలు ఎన్రోల్మెంట్ చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కట్టారు. మరికొంత మంది అభ్యర్థులు తమ సిబ్బంది ద్వారా పట్టభద్రుల వివరాలు, సర్టిఫికెట్లు సేకరించి ఎన్రోల్మెంట్ చేశారు. అభ్యర్థులు చూపిన చొరవ వల్లే ఈ మాత్రం జరిగిందని, లేదంటే గతంలోకన్నా తగ్గేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
టీచర్ ఎమ్మెల్సీ నమోదు కూడా నిరాశాజనకమే
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కూడా నిరాశజనకంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. అప్పుడు మొత్తం 23,214 మంది ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అందులో 7,322 మంది మహిళా టీచర్లు, 15,892 మంది పురుష ఓటర్లున్నారు. ఈ సారి ఎన్రోల్మెంట్ మరో నాలుగు నుంచి ఐదు వేలు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, సోమవారం మధ్యాహ్నం వరకు చూస్తే నియోజకవర్గంలో 16,150 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. పట్టభద్రుల ఎన్‌రోల్‌మెంట్‌తో పొలిస్తే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్పై ఔత్సాహిక అభ్యర్థులు పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వేడెక్కుతున్న వాతావరణం
ఇటు పట్టభద్రులు, అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 15 జిల్లాల్లో హీట్ పెరిగింది. ఎవరికి వారే ఆయా స్థానాల్లో తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు ఈసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. ప్రతి జిల్లా నుంచి కొంతమంది వివిధ పార్టీల నుంచి మద్దతు ఆశిస్తుండగా.. మరికొంత మంది స్వతంత్రులుగా బరిలోకి దిగి వారి సత్తా చాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే తమ అనుకున్న కుటుంబాల్లో పట్టభద్రులు ఎక్కడుంటే అక్కడ వారి ఓటు ఎన్రోల్మెంట్ అయ్యేలా చూస్తున్నారు. అంతేకాదు, ఈ సారి చాలా మంది అభ్యర్థులు ఒక అడుగు ముందుకేసి, ఎవరికి వారే తమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. తమను గెలిపిస్తే ఏమిచేస్తారో ముందుగానే ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగా కలుస్తూ.. ఫోన్లు చేసి మాట్లాడుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఎన్నికల వాతావారణం రోజురోజుకూ వేడేక్కుతున్నది. ప్రధాన పార్టీలు మాత్రం నేటికి వారి అభ్యర్థులను డిక్లేర్ చేయలేదు. పలువురు అభ్యర్థులు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయా పార్టీల మద్దతు ఎవరికి దక్కుతుందన్న విషయంపై ఆసక్తి నెలకొన్నా, ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం ఉండడంతో ఇప్పుడే ప్రధాన పార్టీలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను డిసెంబర్లో లేదా సంక్రాంతి తర్వాత గానీ వెల్లడించ వచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని వెరిఫికేషన్ చేస్తున్నారు. సదరు పట్టభద్రులు, టీచర్లు సమర్పించిన సర్టిఫికెట్లు నిజమేనా..? లేదా..? అన్న వివరాలు సేకరించి వాటి ఆధారంగా ఓకే చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని అనేక దరఖాస్తులను రిజెక్టు చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇస్తున్నారు.
గడువు పెంచుతరా..?
ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం చూస్తే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఓటరు నమోదుకు ఈ నెల 6న గడువు ముగియనున్నది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఏదైనా సరే రేపటి రాత్రి వరకే దరఖాస్తు చేసుకునే అవకాశమున్నది. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అంచనాలకు అనుగుణంగా ఓటర్ ఎన్రోల్మెంట్ జరగలేదన్న అభిప్రాయాలు అన్ని జిల్లాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ ఎన్రోల్మెంట్ గడువు పెంచాలన్న విజ్ఞపులు ఎన్నికల సంఘానికి వెళ్తున్నాయి. పరిస్థితులపై ఎన్నికల సంఘం కూడా విశ్లేషణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, అంచనాలకు అనుగుణంగా ఏయే జిల్లాల్లో ఎన్రోల్మెంట్ కాలేదు, అందుకు కారణాలు ఏమిటీ అన్న కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం గడువు పెంచుతుందా..? లేదా..? అన్న ఉత్కంఠ నెలకొనగా.. విశ్వసనీయ వర్గాల ప్రకారం గడువు పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.