కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 4 : కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 6 రౌండ్లు ముగియగా, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిదే ఆధిక్యం కనిపించింది. ఇప్పటివరకు 1.26 వేల ఓట్ల లెక్కింపు పూర్తికాగా, బీజేపీ అభ్యర్థికి 45,815 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వీ నరేందర్‌రెడ్డికి 38,703, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 32,103 ఓట్లు వచ్చాయి. 7,112 ఓట్ల ఆధిక్యతతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. సోమవారం ఉదయం మొదలైన ఈ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు మొత్తం పోలైన ఓట్ల నుంచి చెల్లని, చెల్లుబాటయ్యే ఓట్ల విభజన పూర్తి చేశారు. అనంతరం మధ్యాహ్నం నుంచి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోలు కాగా, వీటిలో 28 వేల వరకు చెల్లని ఓట్లు ఉన్నాయి. 2.24 లక్షల ఓట్లు చెల్లుబాటు కాగా, వీటిని లెక్కించేందుకు మొత్తం 21 టేబుళ్లు వినయోగిస్తున్నారు. ప్రతి రౌండ్‌కు 21 వేల ఓట్ల చొప్పున లెక్కిస్తుండగా, ఒక్కో రౌండ్ లెక్కింపునకు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతున్నది. నిరంతరాయంగా లెక్కింపు కొనసాగుతుండడంతో బుధవారం మధ్యాహ్నం వరకు ఫలితం తేలనుండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.