CPI | సిరిసిల్ల రూరల్, మే, 29: జూన్ మాసంలో జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ జిల్లా నాల్గవ మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. ఈమేరకు తంగళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జూన్ నెలలో 13, 14 తేదిలలో సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈసభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మేల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డిలు హాజరౌతారని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల కాలంలో సీపీఐ పార్టీ చేసిన పోరాటాలపై విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు.
అదే విధంగా జిల్లాలో పోడు సాగు చేసుకునే రైతులకు సంబంధించిన పట్టాల కోసం అనేక దఫాల్లో సీపీఐ పోరాటాలు చేసిందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న హమాలీకార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో అనుమతులు లేకుండా కోకలుగా భారీ పరిశరమలు నిర్మించడం జరిగిందని, ఆపరిశ్రమలతో కాలుష్యం బయటకు వెల్లి పంటలకు నష్టం చేకూరుతుందని, ప్రజలు శ్వాస కోశ వ్యాధులతో ఆసుపత్రుల చుట్టుతిరుగుతున్నారని ఆరోపించారు.
అలాంటి పరిశ్రమలను గుర్తించి, మూసివేయాలని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మీసం లక్ష్మణ్, ఎలిగేటి రాజశేఖర్, సోమనాగరాజు తదితరులు ఉన్నారు.