police | పెద్దపల్లి రూరల్, ఆగస్టు 11 : పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి , మేరపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటన అంతా పోలీసుల నిఘా, అడుగడుగునా పోలీసుల బందోబస్తు మధ్య జరిగింది. మండలంలోని అప్పన్నపేట, బొంపల్లి , మేరపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసే కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే పర్యటనలో ఎటు చూసినా పోలీసుల రక్షణ ఉండడంతో వారందరిని చూసిన ప్రజలు ఏవైనా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారు సైతం ఎక్కడ గొడవ చేసిన కేసులు పెడతారో, కొడతారో అనే భయంతో ఎమ్మెల్యేను వారి బాధలు చెప్పుకుందామని వచ్చిన వారు సైతం చేసేదేమిలేక వెనుదిరిగి వెళ్లి పోయారు.
ఇక ఎవరైనా ధైర్యం చేసి ఏమైనా మంచిదే ఎమ్మెల్యేకు చెప్పుకుందామని వెళ్లిన వారిని సైతం పోలీసులు అట్టి దరఖాస్తులను తీసుకుని ఎమ్మెల్యేకు ఇచ్చేలా అక్కడే ఉండడంతో నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్లగా కొంతమందిని స్థానిక నాయకులే తర్వాత మాట్లాడుదామంటూ నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడం అందరిని ఆలోచనలో పడేసింది. మా ఊరికి వచ్చినప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడు మా సమస్యలు ఎమ్మెల్యేకు చెప్పుకునేదంటూ ఎవరికి వారే తిట్టుకుంటూ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయి కూర్చున్నారు. ఏదేమైనా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ గోడు వెళ్ల బోసుకుని సమస్యలు చెప్పుకునే వెసలుబాటును కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.