జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అంటుండడంతో రోజురోజుకూ ఇరువురి మధ్య పంచాయితీ ముదురుతోంది. ఈ వర్గపోరుతో నియోజకవర్గంలో పాలన పడకేసింది. ఫలితంగా అభివృద్ధి ఖల్లాస్ అయింది. ఇందిరమ్మ కమిటీలు ఇంతవరకు అతీగతి లేకపోగా, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఊసే లేకుండా పోయింది. మరోవైపు వీరువురి మధ్య నియోజకవర్గ అధికారులు నలిగిపోతుండగా, బదిలీ చేయించుకోవడమే నయమంటున్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.
జగిత్యాల, మే 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్, ఏడాది క్రితం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం, తర్వాత నియోజకవర్గంలో రాజకీయాలు మారిపోవడంతో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఆయన వర్గీయులు తీవ్ర ఆవేదనకు లోనవుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత నెల 28న జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి గడువు పూర్తవడం, పార్టీ మరోసారి అవకాశం కల్పించకపోవడంతో కాంగ్రెస్‌తో పాటు నియోజకవర్గంలోనూ ఆయనకు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొన్నటి వరకు ప్రొటోకాల్ విషయంలో పెద్దగా సమస్యలు రాకపోయినా, ఎమ్మెల్సీ పదవి ముగియడంతో తలెత్తుతున్నాయి. దీనికి తోడు పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండడం, అధికారులు సైతం ఆయన మాటకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుండడం మాజీమంత్రి, ఆయన అనుచరవర్గం జీర్ణించుకోలేకపోతున్నది.
పదేండ్లుగా అధికారంలో ఉండి, తమను ఇబ్బందులకు గురిచేసి, ఇప్పుడు పార్టీ మారి మళ్లీ తమపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరిన ఈ ఏడాది కాలంలో పలుమార్లు జీవన్‌రెడ్డి, ఆయన వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చినా, ఇప్పుడు ఇరువురి మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఏకంగా రాష్ట్ర మంత్రినే జీవన్‌రెడ్డి “మీ రాజ్యం మీరు ఏలుకోండి” అంటూ బాహాటంగా వ్యాఖ్యానించడం, ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, స్పీకర్‌ను అడగండి అంటూ వ్యాఖ్యానించడం.. తర్వాత ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అత్యధిక సార్లు ఓడిపోయింది జీవన్‌రెడ్డినే” అంటూ దెప్పిపొడవడంతో జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.
ఎమ్మెల్సీ పదవి ముగిసిన తర్వాత నుంచి జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేపై విమర్శల జోరు పెంచారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్‌లో తప్పుడు పద్ధతిలో చేరారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సారంగాపూర్ మండలంలోని రేచపల్లిలో “కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యం చేసి, గోస పోసుకున్న వాళ్లు, ఇప్పుడు అధికారం రాగానే మళ్లీ కాంగ్రెస్ ముసుగు వేసుకొని మళ్లీ దౌర్జన్యాలు చేయడానికి వస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. తర్వాత సైతం అదే పద్ధతిలో వ్యవహరించారు. “బతుకచ్చినోడు బతుకచ్చినట్లే ఉండాలి.. ఇల్లును ఆక్రమించుకుంటానంటే ఊర్కోం” అంటూ పరోక్ష వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. బూర్జువా కుటుంబానికి చెందిన వారని, భూస్వామ్య విధానాలు అంటూ సైతం విమర్శిసూ వస్తున్నారు. దీనికి తోడు పదేండ్ల పాటు అభివృద్ధి చేయడం చేతకాక ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చాడంటూ విమర్శిస్తున్నారు.
తాజాగా, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగిత్యాలకు వచ్చిన సమయంలోనూ జీవన్‌రెడ్డి ఒకరకంగా తన ఆగ్రహాన్ని, నిరసనను ప్రత్యక్షంగానే తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఆలింగనం చేసుకోవడానికి వస్తే నిరాకరించడంతో పాటు, “మీ రాజ్యం మీరు ఏలుకోండి.. మా పని, పార్టీ పని అయిపోయింది..” అంటూ మీడియా సాక్షిగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో తనకు తెలియదని, స్పీకర్‌ను అడిగితే చెబుతారంటూ మాట్లాడడం కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితిని కలిగించింది. ఈ విషయమై డాక్టర్ సంజయ్ జగిత్యాలలో స్పందించడంతో, మరోసారి జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేపై విమర్శల వర్షం కురిపించారు.
ఎమ్మెల్యే సంజయ్ సైతం ప్రతి విమర్శలతో జీవన్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. టీడీపీకి ఎవరు వెన్నుపోటు పొడిచిండ్రో తెలుసంటూ ఆయన విమర్శిస్తున్నారు. తమది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమని, ఏనాడూ తనను కాంగ్రెస్‌లోకి జీవన్‌రెడ్డి ఆహ్వానించలేదంటూ కౌంటర్లు ఇస్తున్నారు. జగిత్యాల అంటే జీవన్, జీవన్ అంటే జగిత్యాల అని అబద్ధపు ప్రచారం చేయించుకుంటున్నారని, జీవన్‌రెడ్డి అసలు జగిత్యాలను ఏం అభివృద్ధి చేశారంటూ విమర్శిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, జీవన్‌రెడ్డి ఏమీ చేయలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి చెప్పుకొంటున్నారని, వాస్తవానికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఓడిపోయిన చరిత్ర సైతం జీవన్రెడ్డిదేనని దెప్పిపొడుస్తున్నారు. సీఎం ఆహ్వానిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నానని, పార్టీలో చేరలేదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో రెండు మార్కెట్ కమిటీలు ఉండగా వీటికి పాలకవర్గాలను ఇంత వరకు నియమించలేదు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయాలన్నీ తారుమారైపోయాయి. ఎమ్మెల్సీగా కొనసాగిన సమయంలో జీవన్‌రెడ్డి జగిత్యాల, రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతోపాటు, పాలకవర్గానికి కొందరు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లను ప్రతిపాదించారు. అలాగే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తోపాటు డైరెక్టర్ల పేర్లను ప్రతిపాదించారు. అయితే, ఎమ్మెల్యే కూడా మరో జాబితాను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య నెలకొన్న పోరు నేపథ్యంలో మార్కెట్ కమిటీ, జిల్లా గ్రంథాలయ సంస్థ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. జగిత్యాలలో నెలకొన్న ఈ వర్గపోరుతో అభివృద్ధి ఆగిపోవడంతో పాటు, అధికారులు, ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య నెలకొన్న వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరువర్గాల మధ్య ఇరుక్కొన్న అధికారులు.. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టలేని దుస్థితికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన పరిస్థితి నెలకొంటే జగిత్యాలలో మరో రకంగా ఉంది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గీయుల మధ్య సభ్యుల ఎంపిక విషయంలో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో ఇప్పటి వరకు ఇందిరమ్మ కమిటీలకు ఆమోద ముద్ర పడలేదు. అలాగే, అధికారుల నియామకంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జరిగిన కొన్ని బదిలీలు, పోస్టింగులు అందరినీ విస్మయానికి గురి చేశాయి. జిల్లాకు కొన్ని నెలల క్రితం వచ్చి, మూడు నాలుగు నెలలు సైతం పనిచేయకముందే ఒక ఉన్నతాధికారి బదిలీకి గురయ్యాడు.
గతంలో ఇదే జిల్లాలో పనిచేసి మరో జిల్లాకు బదిలీపై వెళ్లిన ఉద్యోగి ఐదారు నెలల వ్యవధిలోనే బదిలీపై తిరిగి వచ్చారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా బియ్యం లెవీ విషయంలో ఉన్న సదరు అధికారి తిరిగి రావడం అందరికీ సందేహాన్ని కలిగించింది. బదిలీ ఉత్తర్వులు తీసుకొని సదరు అధికారి విధుల్లో చేరేందుకు కార్యాలయానికి రాగా, జిల్లాకు చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి సదరు అధికారిని విధుల్లోకి తీసుకోవద్దని అడ్డు చెప్పడం, మరో ప్రజాప్రతినిధి సపోర్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి తన మాట వినడం లేదని, నజరానాలు సమర్పించడం లేదన్న మిషతో కీలక విభాగంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారిని బదిలీ చేయించి మరో అధికారిని తెచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి.
అలాగే, జిల్లాలో రాజకీయ సంచలనాలకు కేంద్రమవుతున్న ప్రజాప్రతినిధి తన పరిధిలో అన్ని కీలక శాఖలకు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉండాలన్న లక్ష్యంతో తన వారినే భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, జిల్లా కేంద్రానికి చెందిన ఒక డివిజన్ స్థాయి అధికారిని ప్రజాప్రతినిధి బదిలీ చేయించడం, దాన్ని మరో వర్గం అడ్డుకొని నిలిపివేయించడం సంచనలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే “జగిత్యాలలో పనిచేసే పరిస్థితులు లేవు.. ప్రభుత్వ పథకాలు అమలు చేసే పరిస్థితి కూడా లేదు.. ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు మా ప్రాణాలు తీస్తోంది.. ఏ నిర్ణయం తీసుకున్నా మరొకరి వద్ద నుంచి అపోజ్ వస్తోంది.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ఇక్కడ పనిచేసే కంటే వేరే వద్దకు బదిలీ చేయించుకోవడం నయం” అంటూ అధికారులు వాపోతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో జగిత్యాలలో పొలిటికల్ హీట్ మొదలైంది. అప్పుడే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆయన అనుచరులు తీవ్ర నిరసన ప్రకటించి, రాజీనామాకు సిద్ధపడగా అధిష్టానం బుజ్జగించడంతో అసంతృప్తితోనే కొనసాగుతూ వచ్చారు. తర్వాత జీవన్‌రెడ్డి అనుచరుడు దారుణ హత్యకు గురికావడం, తన అనుచరుడిది రాజకీయ హత్య అని ఆయన ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఈ ఏడాది మార్చి 28న జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసిన తెల్లవారే ఎమ్మెల్యే చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపర్చింది. మోతె రోడ్డులో ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్ కార్యాలయంగా నిర్వహించిన తన సొంత ఇంటిని జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పేర్కొంటూ, అక్కడే చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో జీవన్‌రెడ్డితోపాటు ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.