కార్పొరేషన్, జనవరి 16: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డిది తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేదారి లేక ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని గట్టిగా ప్రజల పక్షాన నిలదీస్తున్నందుకే ఎలాంటి అవినీతి లేకున్నా ఈ ఫార్ములా కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వ్యవహారశైలిని ప్రజలందరూ గమనిస్తున్నారని వారికి త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
గురువారం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఫార్ములా కేసు ఓ లొట్టపీసు కేసు అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి కావాలనే ఫార్ములా ఈ రేస్ రద్దు చేసి తెలంగాణ యువతకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ రేస్ కేసులో అసలు కరప్షనే జరుగనప్పుడు అవినీతి కేసు ఎలా పెడుతారని నిలదీశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొట్లాది రూపాయలకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. అందుకే ఆయనను ఏ పార్టీ అని నిలదీశానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన ఆయన మా పార్టీ బట్టలు విప్పుతానని మాట్లాడితే ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. సంజయ్‌కుమార్ బీఆర్ఎస్, కేసీఆర్ బొమ్మ లేకపోతే వార్డు మెంబర్‌గా కూడా గెలవగలడా..? అని నిలదీశారు. కరీంనగర్ సమీక్షా సమావేశంలో మంత్రుల ఆదేశాల మేరకు అందరూ ఎమ్మెల్యేలు తనను బెదిరించారని, కరీంనగర్ ఆర్డీవో ఎవరో తనకు తెలియదని, ఆయన తనపై కేసు ఎలా పెడుతారని ప్రశ్నించారు. సమీక్షా సమావేశం ఉందని పిలిచి ఇలా కేసులు పెడతారా..? అని మండిపడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే తనపై దాడి చేశాడన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామని, కడిగేస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ తెలంగాణ సాధించకుంటే రేవంత్‌రెడ్డికి సీఎం సీటు వచ్చేదా అని ప్రశ్నించారు. తన మీద ఎలాంటి క్రిమినల్, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవని, కానీ పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పీడీ యాక్టు పెట్టాలంటే తనకంటే ముందుగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే పెట్టాలని సూచించారు. పండుగ సమయంలో అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం ఏమిటని, ఇది ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేస్తామని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు.