MLA Padi Kaushik Reddy | వీణవంక, జూలై 4: అమ్మా.. బాగున్నవా.. తాత ఎలా ఉన్నవే.. అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుకెళ్లారు. శుక్రవారం ఆయన సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు, ఎలుబాక, గంగారం, బొంతుపల్లి, కిష్టంపేట, నర్సింహులపల్లి, దేశాయిపల్లి, మల్లారెడ్డిపల్లి, శ్రీరాములపేట, హిమ్మత్‌నగర్, కొండపాక, పోతిరెడ్డిపల్లి, బేతిగల్, నర్సింగాపూర్, రెడ్డిపల్లి, వీణవంక, మల్లన్నపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఏకంగా 69 మంది లబ్ధిదారుల ఇండ్లకెళ్లి రూ.14,88,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డే స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తూ వారికి భరోసా కల్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు వీలైనంత తొందరగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ బడ్జెట్ పెంచారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు కామిడి శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రెడ్డి, పుల్లారెడ్డి, సత్యనారాయణ, తిరుపతి, రమేష్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.