హుజూరాబాద్ రూరల్, నవంబర్ 18: ‘ఆపద వస్తే తోబుట్టువులా అండగా ఉంటా. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి ప్రజలను కోరారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి మండలంలోని చిన్నపాపయ్యపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి, పట్టణ పరిధిలోని దమ్మక్కపేట, ఇప్పల నర్సింగాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే రూ.
వెయ్యి కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు, రైతు బంధు, బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేస్తే అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించిందని, అయినా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అభివృద్ధి జరిగిందని, దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన రాబందులు వస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా లేకుంటే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కష్ట్టపడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి పాడి కౌశిక్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి సతీమణి శాలిని, సింగిల్ విండో చైర్మన్ కొండల్‌రెడ్డి, సర్పంచులు దేవేంద్ర-కొండల్‌రెడ్డి, రజిత-దయాకర్‌రెడ్డి, నిరోషా-కిరణ్‌కుమార్, ఎంపీటీసీలు శిరీషా-ముకుందారెడ్డి, అనిత-వెంకట్, పార్టీ మండలాధ్యక్షుడు సంగెం ఐలన్న, నాయకులు పొల్సాని రజనీకాంత్‌రావు, రవీందర్రావు, పోరెడ్డి వెంకటకిషన్రెడ్డి, శంతన్‌రెడ్డి, రమణారెడ్డి, నరెడ్ల భాస్కర్‌రెడ్డి, బండ శ్రీనివాస్, రాజుతో పాటు తదితరులు ఉన్నారు.