గంగాధర, మార్చి 23: రానున్న వేసవికాలం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో తాగునీటి(Drinking water) ఎద్దడి రాకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది, మిషన్ భగీరథ సిబ్బంది సమన్వయంతో పనిచేసి తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో అవసరం ఉన్నచోట బావుల తవ్వకం, బోర్ వెల్స్ వేయించడం, నూతన పైప్ లైన్లు వేయడం, గేట్ వాల్వులు, పైప్ లైన్లో మరమ్మతు చేయడం, బోర్ల ఫ్లషింగ్ వంటి వాటిని పూర్తి చేయడానికి నివేదికను తయారు చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన ఏ చిన్న సమస్య సమస్య ఉన్న గుర్తించాలని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటికి సమస్యలకు సంబంధించిన నివేదికను రెండు రోజుల్లో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.