గంగాధర, మార్చి 9 : చొప్పదండి నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipalli )పేర్కొన్నారు. కరీంనగర్ డిపో నుండి గంగాధర మండలం కురిక్యాల మీదుగా గర్శకుర్తి, బోయినపల్లి మండలం మర్లపేట, బోయినపల్లి నుండి వేములవాడ వరకు గతంలో అధికారులు ఆర్టీసీ బస్సును నడిపించి ఆ తర్వాత నిలిపివేశారని తెలిపారు. బస్సును నిలిపివేయడంతో ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లడానికి గర్శకుర్తి గ్రామంలోని నేత కార్మికులు వ్యాపార వాణిజ్య లావాదేవీల కోసం సిరిసిల్ల పట్టణానికి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.
ఆయా గ్రామాల ప్రజల కోరిక మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులను పునఃప్రారంభించినట్లు తెలిపారు. దీంతో సిరిసిల్లతో వ్యాపార వాణిజ్య అవసరాల కోసం వెళ్లడానికి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి సులభంగా వెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.