కరీంనగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ): సన్మానాలు.. సత్కారాలతో సాఫీగా జరగాల్సిన జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం ఎన్నడూ లేనంత వాడీవేడిగా సాగింది.బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నల వర్షం, అధికారుల నిలదీతలతో దద్దరిల్లిపోయింది. డీఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేయడం, ఈసందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం దూషణలకు దిగడం గందరగోళానికి దారితీసింది. మరో పక్క దళితబంధు రెండో విడుత నిధులు వెంటనే విడుదల చేయాలని టీషర్ట్ వేసుకుని వచ్చిన దళిత జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్‌ను పోలీసులు అవమానకరంగా గేటు బయటి వరకు వెళ్లగొట్టడంపై పెద్ద దుమారమే రేగింది. కాగా, మధ్యాహ్న భోజనం తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై సభ్యులను సన్మానించారు.ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు ఉద్వేగానికి లోనయ్యారు.
జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ అధ్యక్షతన మంగళవారం కరీంనగర్ జడ్పీ చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మొదట వైద్య, ఆరోగ్య శాఖపై చర్చ జరగ్గా.. మానకొండూర్, శంకరపట్నం సభ్యులు అధికారులపై ప్రశ్నలు సంధించారు. అధికారుల సమాధానాలతో సంతృప్తి చెందని సభ్యులు, ఐదేళ్లుగా ఇలాంటి మాటలే వింటున్నామని, ఇంకెప్పుడు సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. అనంతరం విద్యా శాఖపై చర్చకు రావడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లేచి ముందుగా డీఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వచ్చి కూర్చున్న కలెక్టర్ పమేలా సత్పతికి జరిగిన విషయం చెప్పారు. ఇటీవల విద్యాశాఖపై సమీక్షించానని, ఆ సమావేశానికి హాజరైన ఎంఈవోలు, హెచ్ఎంలకు డీఈవో జనార్దన్ రావు మెమోలు జారీ చేశారని, ఎంఈవోలుగా ఇన్చార్జి బాధ్యతల నుంచి హెచ్ఎంలను తప్పించారని, ఆయనకు ఈ అధికారం ఎక్కడిదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేగా తనకు నియోజకవర్గంలో శాఖల పనితీరును సమీక్షించే అధికారం లేదా..? అని అడిగారు. దీంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ అభ్యంతరం చెప్పారు.
కొత్తపల్లి జడ్పీటీసీ పిట్టల కరుణతోపాటు మరో ఇద్దరు సభ్యులు, ఎంపీపీలు ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులపై మాటల దాడికి దిగారు. దాంతో ఎమ్మెల్యే ఆగ్రహించి, కాంగ్రెస్‌కు అమ్ముడు పోయిన మీరు మాట్లాడుతున్నారా..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆ సమయంలో సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన కలెక్టర్‌ను బీఆర్ఎస్ సభ్యులతో కలిసి కొద్దిసేపు అడ్డుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న తన హక్కులకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించిన డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోగానే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మరోసారి వివాదం ముదిరింది. జడ్పీ అధ్యక్షురాలు ఎన్నిసార్లు విన్నవించినా సభ్యులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి మేరకు డీఈవోను సస్పెండ్ చేయాలని శంకరపట్నం జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మానకొండూర్ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆమోదించారు. తీర్మానం పాసైనట్టు జడ్పీ అధ్యక్షురాలు విజయ ప్రకటించారు. దీనిని ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె వెల్లడించారు.
దళిత జడ్పీటీసీకి అవమానం
సర్వసభ్య సమావేశం సాక్షిగా ఓ దళిత జడ్పీటీసీకి సభ్యుడికి అవమానం జరిగింది. జమ్మికుంటకు చెందిన దళిత జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ దళిత బంధు రెండో విడుత నిధులు ఇవ్వాలని అంబేద్కర్ బొమ్మతో ఉన్న టీ షర్ట్ ధరించి సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు గేటు వద్దనే నిలిపివేశారు. ఆ టీ షర్ట్‌ను తీసేసి వేరే షర్టు వేసుకుని వస్తేనే అనుమతిస్తామని చెప్పారు. అందుకు శ్యామ్ ఒప్పుకోక పోవడంతో చాలాసేపటి వరకు గేటు వద్దనే నిలబెట్టారు. ‘మీరు ఇక్కడ ఉండద్దు. షర్ట్ మార్చుకొని సమావేశానికి రండి. లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ హుకుం జారీ చేశారు. అయినా ఆయన వెళ్లకుండా అక్కడే ఉండడంతో బలవంతంగా జడ్పీ మెయిన్ గేటు వరకు తీసుకెళ్లి వదిలేశారు. ఇదే విషయమై జడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది.
మునుపెన్నడూ చూడని విధంగా జడ్పీ సమావేశం పోలీసుల నిర్భందంలో నడస్తున్నదని మానకొండూర్, శంకరపట్నం జడ్పీటీసీలు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ‘మేం నక్సలైట్లమో..? టెర్రరిస్టులమో..?’ అన్నట్టు ఏమిటీ నిర్బంధమని ప్రశ్నించారు. జడ్పీటీసీ శ్యామ్‌ను వెంటనే సమావేశానికి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు ముకుమ్మడిగా డిమాండ్ చేశారు. దీంతో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ స్పందించి శ్యామ్‌ను లోనికి రానివ్వాలని పోలీసులకు చెప్పారు. తమకు జడ్పీ సీఈవో చెప్పాలని అక్కడ ఉన్న పోలీస్ అధికారులు స్పష్టం చేయడంతో మరోసారి సీఈవోకు చెప్పారు. ఆయన మౌనంగా ఉండిపోయారు. ఈ సందర్భంగా జ్యోక్యం చేసుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఇది ఒక్క జమ్మికుంట జడ్పీటీసీకి జరిగిన అవమానం కాదని, ఒక జడ్పీ అధ్యక్షురాలికి తద్వారా సభకు అవమానం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
డీఈవో చర్యలు చట్టవిరుద్ధం
ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నా పరిధిలోని ప్రభుత్వ శాఖలను సమీక్షించే అధికారం నాకు ఉంటుంది. నేను నిర్వహించిన సమీక్షకు హాజరైన ఎంఈవోలకు, హెచ్ఎంలకు డీఈవో మెమోలు జారీ చేయడం చట్ట విరుద్ధం. ఈ విషయంలో నేను ఎంత వరకైనా పోరాడతా. నా హక్కులను అవమాన పరిచిన డీఈవోను సస్పెండ్ చేయాలి. లేదంటే ప్రివిలియెన్స్ మోషన్ తీసుకుంటాం. త్వరలో స్పీకర్‌ను కలుస్తా. అక్కడ కూడా స్పందన లేకపోతే హై కోర్టుకు వెళ్తా. ఒక దళిత జడ్పీటీసీని పోలీసులు అవమానించారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లో అమలైంది. ఇంకా 4,500 మందికి రెండో విడుత గ్రాంట్ రావల్సి ఉన్నది. దళితబంధు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చినట్టు స్వయంగా కలెక్టర్ మీడియా సాక్షిగా చెప్పారు. యావత్ తెలంగాణలో ఉన్న దళితులు ఆలోచించాలి. ఈ విషయమై నేను అసెంబ్లీలో కూడా మాట్లాడా. దళితబంధు వెంటనే విడుదల చేయాలి.
– మీడియాతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సభ్యులకు సన్మానం
ఐదేళ్లపాటు సేవలందించిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల పదవీ కాలం ఈ నెల 5తో ముగియనున్నది. మంగళవారం చివరి సమావేశం కావడంతో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు తన ఐదేళ్ల ప్రస్తానాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అంటారని, కానీ తన విజయాల వెనక తన భర్త గణపతి ఉన్నారని విజయ అన్నారు.
మంచిసేవలతో చిరకాలం గుర్తింపు
రాజకీయాలు వేరు.. ప్రజా సేవ వేరు. ప్రజలకు మంచిగా సేవలందిస్తే ఎవరైనా చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లు ఎంపీగా పనిచేశా. అనుభవజ్ఞులైన ఎందరో జడ్పీకి సారథ్యం వహించారు. వాళ్లంతా అక్కడితో ఆగకుండా ఇతర పదవులు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. నాయకులు అనే వాళ్లు అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల్లోనే ఉండాలి. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా సమస్యలపై ఎప్పుడైనా నన్ను కలువవచ్చు. పార్టీలకతీతంగా పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్థానిక సంస్థలను భవిష్యత్తులో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.
– మంత్రి పొన్నం ప్రభాకర్
దళితుడిననే చిన్నచూపు
నేను దళితుడిననే చిన్నచూపు చూశారు. నా జాతికి న్యాయం చేయాలనే నిశ్చయంతో జడ్పీ సర్వసభ్య సమావేశానికి టీ షర్ట్ వేసుకుని వెళ్తే కనీసం గేటు దగ్గరికి కూడా రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇది చివరి సమావేశమని, చివరి సారిగా అందరం కలుసుకుంటున్నామని ఎంత బతిమిలాడినా కరీంనగర్ ఏసీపీ నన్ను లోనికి అనుమతించలేదు. పార్లమెంట్, అసెంబ్లీలోకి వెళ్లేటప్పుడు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు కండువాలు కప్పుకొని పోతారు. ప్రజల సమస్యలను ఏకరువు పెట్టడానికి కొన్ని నమూనాలు తీసుకెళ్తారు. జిల్లా స్థాయిలో ఇది కూడా ఒక సభే అయినందున నేను ఈ రకమైన టీ షర్టును ధరించి వెళ్లా. ఇది నేను చేసినా తప్పా? దళితబంధు రెండో విడుత డబ్బులు విడిపించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆంక్షలు విధిస్తున్నది. నాకు అవమానం జరిగినా పర్వా లేదు కానీ, నా జాతికి అవసరమైన గ్రాంట్‌ను విడుదల చేయాలి.
– శ్రీ రామ్ శ్యామ్, జమ్మికుంట జడ్పీటీసీ