మెట్పల్లి రూరల్, ఆగస్టు 13 : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరారు. మంగళవారం పెద్దాపూర్ గురుకులానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి గురుకులాల సమస్యలు తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు.
ఇద్దరు విద్యార్థుల మృతికి వంద శాతం పాముకాటే కారణమని తెలిపారు. కడుపునొప్పి, వాంతులు చేసుకోవడం, కళ్లు తెరవకపోవడం వంటి లక్షణాలతో విద్యార్థులు బాధపడ్డారని, ఇవన్నీ పాముకాటు వల్లే కలిగే లక్షణాలేనని ఆయన స్పష్టం చేశారు. ఆ ఇద్దరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఏకైక కొడుకులని, ఇలాంటి బాధలు భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులకూ రాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
ప్రతి గురుకుంలో ఒక హెల్త్ సూపర్వైజర్తోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, ఈ గురుకులాలన్నింటికీ సెంట్రల్ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, దీనివల్ల అత్యవసర సమయాల్లో విద్యార్థులకు తక్షణ వైద్య సేవలందించేందుకు దోహదపడుతుందన్నారు. పెద్దాపూర్ గురుకులంలో కొత్తగా నిర్మించిన జీ ప్లస్వన్ భవనంపై మరో అంతస్తును నిర్మిస్తే ఇదే భవనంలో విద్యార్థులకు తరగతుల నిర్వహణ, బస కోసం సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికే బడ్జెట్లో నిధులు కేటాయించిందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాలను ప్రక్షాళన చేయనున్నట్టు తెలిపారు.