కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 22: రేకుర్తిలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. సోమవారం రేకుర్తిలోని శ్రీ కంకాలమ్మ కేతేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొకులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో మేదర కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. అనంతరం రేకుర్తి గుట్ట సమీపంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఫిబ్రవరిలో జరిగే జాతరకు కార్పొరేషన్ ద్వారా చేపట్టే ఏర్పాట్లపై మేయర్‌ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రేకుర్తిలోని అమృతేశ్వర ఆలయంలోనూ పూజలు చేశారు. ఆ తర్వాత టవర్సరిల్ సమీపంలో వాల్మీకి మహర్షి ఆలయాన్ని ప్రారంభించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేకుర్తిలో సమ్మక్క జాతర అత్యంత వైభవంగా సాగుతున్నదని, భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభిస్తామన్నారు. ఈ సారి కూడా 5 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు.
జాతరకు జిల్లా యంత్రాంగం నుంచి చేయాల్సిన ఏర్పాట్లను ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరుతున్నామన్నారు. జాతరకు ఐదు రోజుల ముందు నుంచే కెనాల్ నుంచి నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి దానిపై ఎలాంటి ప్రణాళిక లేదని, త్వరగా సిద్ధం చేయాలని కోరారు. నగరపాలక సంస్థ ద్వారా చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారని, జిల్లా యంత్రాంగం, పోలీస్, రెవెన్యూ పక్షాన చేయాల్సిన పనులు త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. కార్యక్రమాల్లో మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు సుధగోని మాధవి కృష్ణగౌడ్, ఏదుర్ల రాజశేఖర్, నాయకులు వంగల పవన్, పిట్టల శ్రీనివాస్ ఉన్నారు.