కరీంనగర్ కమాన్ చౌరస్తా, డిసెంబర్ 24: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక మారెట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలను ఆరేండ్లుగా వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా బ్రహ్మాండంగా జరుపుతామని చెప్పారు. నిర్వహణలో భాగంగా తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆదివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణ తేదీలను ఆలయ కమిటీ సమక్షంలో వెల్లడించారు.
ఫిబ్రవరి 11న అధ్యయనోత్సవాలతో ఉత్సవాలు ప్రారంభమై, ఫిబ్రవరి 18న శోభాయాత్రతో ముగుస్తాయని తెలిపారు. 12న తదియ అంకురార్పణ ఉంటుందని, పుట్టమన్ను తెస్తారని, అదే రోజు సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షబంధనం, అంకురార్పణ, శేషావాహనసేవ ఉంటాయని చెప్పారు. 13న యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, సూర్యప్రభ వాహనసేవ, బేరి పూజా, నిత్య పూర్ణహుతి, బలిహరణం, చంద్రప్రభ వాహన సేవ.. 14న కల్ప వృక్ష వాహన సేవ, ఎదురోళ్ల ఉత్సవం, అశ్వవాహన, గజవాహన సేవ.. 15న మాఘ షష్ఠి గురువారం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ ఉంటాయని తెలిపారు.
16న సింహ వాహన సేవ, బలిహరణ, తీర్థప్రసాద గోష్ఠి హనుమత్ వాహన సేవ, 17న మహాపూర్ణాహుతి, చక్ర వసంతోత్సవం, పుష్పయాగం, ద్వాదశారధన, సప్తాప వర్ణములు, ధ్వజారోహణ, ఏకాంతసేవ, పండిత సన్మానం ఉంటాయన్నారు. 18న రాంనగర్ మార్ ఫెడ్ ప్రాంగణం నుంచి ఆలయం వరకు శోభా యాత్ర ఉంటుందని వివరించారు. సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, ఆలయ ఈఓ ఉడుతల వెంకన్న, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, గంగాధర్, ఆలయ డైరెక్టర్ పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గందె మహేశ్, నేతి రవి వర్మ, దుడ్డెల శ్రీధర్, గంప రమేశ్, గోవిందపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.