కార్పొరేషన్/ తిమ్మాపూర్, నవంబర్ 27: మేధావులు, ఉద్యమకారులు, కార్యకర్తలతో కలిసి ఈ నెల 29న అల్గునూరులో దీక్షా దివస్ను నిర్వహిస్తున్నామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారని చెప్పారు. జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం అల్గునూర్లోని వరంగల్ రోడ్లో దీక్షా దివస్ సభా స్థలిని మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్తో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడారు. ఆనాడు ఆమరణ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు కుటిల ప్రయత్నాలు చేశారని, అల్గునూర్ చౌరస్తాలో అరెస్ట్ చేసి ఖమ్మం తరలించినప్పటికీ కేసీఆర్ వెనకి పోకుండా ఆమరణ దీక్ష చేపట్టారని కొనియాడారు. దాని ఫలితంగానే నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణను ఇచ్చిందని గుర్తు చేశారు. దీక్షా దివస్ రాజకీయ కార్యక్రమం కాదని, తెలంగాణ రావడానికి కీలకమైన రోజని అభివర్ణించారు. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు అల్గునూరు చౌరస్తా నుంచి సభాస్థలి వరకు ర్యాలీ తీసి, కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ పేరు లేకుండా చేస్తామని కొందరు కూతలు కూస్తున్నారని, అది రాసిపెట్టిన బోర్డు కాదని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే పేరని స్పష్టం చేశారు.