జగిత్యాల టౌన్, జనవరి 29 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. జాబితాపూర్, హబ్సీపూర్ సర్పంచ్‌లు, జడ్పీ చైర్పర్సన్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ అనుబంధ నాయకులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించడం బాధాకరమన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి జాబితాపూర్ సర్పంచ్‌ను సస్పెండ్ చేయిస్తే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినట్టు చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్పంచులు ఉన్న చోట్ల సైతం అభివృద్ధికి సహకరించామని, వారు చేసిన పనులపై ఏనాడూ ఎంక్వైరీ చేయించకుండా బిల్లులు ఇప్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు సంబంధించిన అల్లీపూర్ సర్పంచ్‌కు ఉత్తమ సర్పంచ్ అవార్డు అందించామన్నారు. రాజకీయ కక్ష పూరితవైఖరి అవలంభించడం జీవన్‌రెడ్డి స్థాయికి సరికాదని హితవుపలికారు. బెల్ట్ షాపులు, మద్యం పాలసీపై గతంలో విమర్శించిన ఆయన 60 రోజుల్లో ఎన్ని బెల్టు షాపులు మూసివేయించారో? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యంపై ఎంత ఆదాయం తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలపైనే మాట్లాడుతున్నారని, 420 హామీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలుపాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ 9 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కనీసం 2024 డిసెంబరులోపైనా పూర్తి చేస్తుందా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పదే పదే మాట్లాడుతున్న ప్రభుత్వం, దెబ్బతిన్న పనులు చేయించకపోవడంతో రోజుకు 6 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుందని, దీనికి ఆ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల నియోజకవర్గ చిట్ట చివరి గ్రామాలైన తాళ్లధర్మారం, చిత్రవేణిగూడెం, బట్టపెల్లిపోతారం, చింతలూరులో ఒక్క ఎకరం ఎండకుండా ఎస్సారెస్పీ నీటిని ఇవ్వాలన్నారు.
గత ప్రభుత్వంలో సాగుకు నీళ్లు ఎలా వచ్చాయో? ఇప్పుడు ఎందుకు రావడం లేదో రైతులు గ్రహిస్తున్నారన్నారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. తగినన్ని బస్సులు లేక సీట్లు దొరకక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. బస్సులు పెంచి అన్ని గ్రామాలకు నడపడం వల్ల మహిళలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. సరైన సమయంలో రాక బస్సు స్టాప్ల వద్ద విద్యార్థులు నిరీక్షిస్తున్నారని, వచ్చిన బస్సుల్లో కెపాసిటీకి మించి జనం ఎక్కడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సమావేశంలో పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు అంకం సతీశ్, అంకతి మల్లయ్య, వీరబత్తిని శ్రీనివాస్, సుమన్‌రావు, పట్టణ యూత్ అధ్యక్షులు కత్రోజ్ గిరి, శరత్‌రావు, రాజు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.