సారంగాపూర్, డిసెంబర్ 29 : రూ.2.92 కోట్లతో బీర్పూర్ మండంలోని కోల్వాయి, మంగెళ, రేకులపల్లి, కమ్మునూర్ గ్రామాల్లోని ఎత్తిపోతల పథకాల పునర్నిర్మాణ పనులు చేపట్టామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామంలో రూ.70 లక్షలతో పునర్నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను ఎస్ఆర్ఎస్పీ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.
రూ.58 లక్షలతో చేపట్టిన కమ్మునూర్ ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మిస్తుండగా ఆ పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేకులపల్లిలో మాట్లాడుతూ గతంలో భారీ వర్షాలతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినగా అధికారులు సకాలంలో పనులు పూర్తి చేశారని అభినందించారు. మండలంలో 751 స్తంభాలు, 84ట్రాన్స్ ఫార్మర్లు ఒక్క రోజులోనే వేసిన ఘనత విద్యుత్ అధికారులదని, ఆ శాఖను బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. రేకులపల్లిలో రూ.45 లక్షలతో పైపులైన్ ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఆర్ఎస్పీ డీ-53 కాలువ నుంచి రోళ్లవాగు, బుగ్గచెరువుతో మండలానికి నీరు సరఫరా అవుతుందన్నారు.
మండలంలోని మిగితా ఎత్తిపోతల పథకాల పునర్నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నారపాక రమేశ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, రామకిష్టు గంగాధర్, యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచంద్రంగౌడ్, ప్రధాన కార్యదర్శి అంజిత్‌రావు, ప్రజాప్రతినిధులు ఎలగందుల లక్ష్మి అశోక్, నల్ల మైపాల్‌రెడ్డి, బందెల మరియా రాజేశం, రిక్కల ప్రభాకర్, పర్వతం రమేశ్, బోడ స్వప్న సాగర్, ఎంపీటీసీ రమ, నాయకులు ముక్క వెంకటేష్ యాదవ్, అంజన్న, స్వామి, రామయ్య, రాజన్న, అనిల్, ఎస్ఆర్ఎస్పీ డీఈ చక్రు నాయక్, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.