సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది.. సమైక్య పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఎటుచూసినా పిచ్చిమొక్కలు మొలిచి, పూడికతో నిండి ఆనవాళ్లు కోల్పోయిన చెరువులకు పునర్జీవం పోసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి పూర్వవైభవం తేవడం పల్లెల స్వరూపమే మారిపోయింది. సాగు పండుగైంది. సబ్బండవర్గాలకు బతుకుదెరువుదొరికింది. ఇందుకు మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలోని రాంసాగర్ కుంటనే నిదర్శనంగా నిలుస్తున్నది.
బీఆర్ఎస్ సర్కారు మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాత 2016లో ఏప్రిల్లో అప్పటి మెట్పల్లి సీఐ వాసం సురేందర్, మల్లాపూర్ ఎస్ఐ షేక్ జానీపాష చెరువును దత్తత తీసుకొని జీవం పోయగా, రైతులకు ఆదరువుగా మారింది. నాటి నుంచి నేటి దాకా పుష్కలమైన జలాలతో సాగుకు సమృద్ధిగా నీరందిస్తూ ఉండగా, అన్నదాతలు, గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– మల్లాపూర్, జూన్ 28