Mission Bhagiratha | మారుతినగర్ జులై 24: మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీరు లీకేజై వృథాగా పోతోంది. వర్షాల నేపథ్యంలో లీకేజవుతున్న మిషన్ భగీరథ నీరు కలుషితమవుతుండడంతో పట్టణంలోని ఆయా కాలనీలో మిషన్ భగీరథ నీరు ఇలా అయితే తాగేదెలా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పట్టణంలోని జోన్వ-1 వాటర్ ట్యాంకు 1500 లక్షల లీటర్ల సామర్థ్యం గల దాన్ని మరమ్మతులు చేపట్టారు.
కానీ మున్సిపల్ అధికారులు వ్యవసాయ మార్కెట్ లో గల వాటర్ 1000 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్ లీకేజీ అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీలవాసులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇంద్రానగర్, సింగపూర్ రోడ్డు, చైతన్య నగర్, సాయి రామ్ నగర్ కాలనీ, ఏకలవ్య నగర్ కాలనీలో నీరు సరిగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్తో కూస్తో వచ్చిన నీరు కలుషితమవడంతో తాగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.