Korutla | కోరుట్ల, జూలై 21 : కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. కోరుట్లలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ప్లాట్ ఫామ్ నంబర్-9పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును అధికారుల కళ్లుగప్పి గుర్తు తెలియని దుండగుడు అపహరించుకుపోయాడు. ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని టీజీ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కల్లూరు మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులను తీసుకు వచ్చేందుకు ప్లాట్ఫామ్-9పై డ్రైవర్ ప్రవీణ్ బస్సును నిలిపి ఉంచాడు. ఆ సమయంలో కండక్టర్ గంగాధర్ కంట్రోలర్ వద్ద గల చాట్లో వివరాలు నమోదు చేసేందుకు వెళ్లగా, డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లాడు. బస్సులో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగుడు బస్సును స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు.
డ్రైవర్ వచ్చి చూడగా బస్సు కనిపించకుండా పోవడంతో డిపో అధికారులకు సమాచారం అందించాడు. బస్సులో అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా బస్సు వెళుతున్న గమనాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే రంగంలోకి దిగిన కోరుట్ల, మెట్పల్లి పోలీసులు బస్సును మెట్పల్లి వద్ద అటకాయించి వెంబడించారు. దుండగుడు బస్సును ఆపకుండా వేగంగా తీసుకువెళ్లాడు. పోలీసులు, ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది తమ వాహనాల్లో చేజ్ చేసి పట్టుకునే ప్రయత్నం చేసినా దుండగుడు మాత్రం చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు మెట్పల్లి శివారులోని సత్తక్కపల్లి క్రాసింగ్ వద్ద బస్సుకు టిప్పర్ వాహనాన్ని అడ్డుపెట్టి నిలిపే ప్రయత్నం చేశారు.
చివరకు జాతీయ రహదారి పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బస్సు నిలిచిపోయింది. పారిపోయేందుకు యత్నించిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. దుండగుడు పోలీసులకు, ఆర్టీసీ సెక్యూరిటీ చిక్కకుండా సుమారు 20 కిలో మీటర్ల దూరం వరకు బస్సును నడుపుకుంటూ తీసుకుపోవడంపై ఆందోళన కలిగిస్తుంది. బస్సును నిర్లక్ష్యంగా నడిపిన దుండగుడు మెట్పల్లి శివారులో పలు వాహనాలను ఢీకొన్నాడు. కోరుట్లలోని అష్టలక్ష్మీ దేవాలయం క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న షకీలానే వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెట్పల్లి శివారులోని ఆరపేట వద్ద ద్విచక్రవాహనంపై వెళుతున్న మరో వ్యక్తిని వ్యక్తిని ఢీకొట్టాడు. కాగా బస్సులో ప్రయాణీకులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా దుండుగుడు సందుల సాంబయ్య అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడు మద్యం సేవించి ఉన్నట్లు తెలిపారు.