Vemulawada | వేములవాడ, జూలై 24 : యువత మత్తుకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవాలని పోలీస్ విస్తృత ప్రచారం చేస్తున్న క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంది. వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్ర పట్టణం కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. వీరి మీదే ఆధారపడి జీవించే యాచక కుటుంబాలు కూడా వందల సంఖ్యలో వేములవాడలో ఉన్నాయి. ఇక ప్రధానంగా జాతర గ్రౌండ్ లాంటి ప్రాంతాలు పూర్తిగా యాత్రికులు వారి మీద ఆధారపడి ఇతర వ్యాపారాలు కొనసాగుతుండగా యాచకులు సైతం ఇదే ప్రాంతంలో నివసిస్తూ జీవనోపాధి పొందుతుంటారు. అయితే ముఖ్యంగా యాచక కుటుంబాల చిన్నారులు విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపకపోవడంతో సమాజానికి ప్రమాదకరంగా తయారవుతున్నారు.
14 సంవత్సరాల లోపు ఉన్న ప్రతీ బాలునికి విద్యాహక్కు కలిగి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో చిన్నారులను గుర్తించి పాఠశాలకు తరలించే కార్యక్రమాలు వేములవాడ లాంటి పుణ్యక్షేత్ర పట్టణంలో విఫలమవుతున్నాయి. వందల సంఖ్యలో ఉన్న కుటుంబాలు జీవన విధానాలతో బాల్యం అస్తవ్యస్తంగా మారి నేరాలవైపు అడుగులు పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు వేములవాడ పట్టణంలో స్థిరపడిన కుటుంబాలలో కొందరు మైనర్ బాలురలు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి చిరు దొంగతనాలు చేస్తుండడంతో అటు కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవసరాల కోసం దొంగతనాలు
వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయం, పార్కింగ్ మైదానం, జాతర గ్రౌండ్ పరిసరాలలో నివసిస్తున్న యాచక కుటుంబాల చిన్నారులు జీవనశైలిలో పూర్తిగా నేర ప్రవృత్తి వైపు అడుగులు పడుతున్నాయి. కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఉన్న పిల్లలు కాస్త రోజుల తరబడి వారి వద్దకు రాకుండా మత్తు పదార్థాలను తీసుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కేవలం 20 నుండి 50 రూపాయల వరకు దొరికే బోన్ ఫిక్స్ లాంటి వాటిని మత్తు పదార్థాలుగా వాడుతూ తూలుతున్నారు. మరోవైపు డబ్బులు లేని తరుణంలో చిన్నాచితక దొంగతనాలు కూడా చేస్తున్నారు. ఇటీవలే జాతర గ్రామంలోని 10 దుకాణాల్లో జరిగిన చోరీలలో ప్రధానంగా మైనర్లే ఉండడం ఇందుకు నిదర్శనం. మరోవైపు వేములవాడ పట్టణంలో స్థిరపడిన కుటుంబాలలో కూడా కొందరు మైనర్ బాలురులు కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారు.
వేములవాడ పట్టణంలోని వైన్స్ దుకాణంలో గత రెండు నెలలుగా స్టాక్ లెక్కలు తేడాగా వచ్చాయి. సీసీ ఫుటేజీని పరిశీలించి చూడగా జాతర గ్రౌండ్ కు చెందిన స్థిరపడిన కుటుంబాలకు చెందిన చిన్నారులుగా గుర్తించి అందరూ మైనర్లే కావడంతో వారి తల్లిదండ్రులను పిలిచి మందలించి జరిగిన చోరీకి సంబంధించిన రికవరీ చేశారు. ఇదే కాకుండా సదర్ మైనర్ లు ఇదే జాతర గ్రౌండ్ పరిసరాలలో ద్విచక్ర వాహనాలలో పెట్రోల్ ను చోరీ చేస్తూ సీసీ కెమెరాలు చిక్కారు. అయితే వీటిని ఆసరాగా చేసుకొని వచ్చే నగదుతో గంజాయి లాంటి మత్తు పదార్థాలుకు కొనుగోలు చేస్తూ తూలుతున్నారని ఆరోపణలు వస్తున్నాయ. నాంపల్లి కేంద్రంగా గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతుండడంతో మైనర్లు కూడా అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మత్తు పదార్థాలకు అలవాటు పడి జాతర గ్రౌండ్ పరిసరాలలో దాదాపు పది మంది వరకు ఇలాంటి చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్న తీరు స్థానిక ప్రజలను భయాందోళన గురిచేస్తుంది.