బోయినపల్లి, డిసెంబర్ 27: వరదవెల్లి గుట్టపై వెలిసిన దత్తాత్రేయ స్వామివారిని ప్రజలు 365రోజుల పాటు దర్శించుకొనేందుకు వీలుగా బోటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే అందుబా టులోకి తీసుకొస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయ స్వామి జయంత్యుత్సవాల ముగింపు వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పొన్నం బుధవారం హాజరయ్యారు.స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా దీవించాలని దత్తాత్రేయ స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరెపల్లి లత, ఎంపీటీసీ ఈడ్గు రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ పుల్లి లక్ష్మీపతిగౌడ్, కాంగ్రెస్ బీసీ సెల్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కూస రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, నాయకులు భీమ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.