కార్పొరేషన్, డిసెంబర్ 18 : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖకు సంబంధించిన మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు.
2023-24ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి సంబంధించి బస్‌పాస్‌లకు రాయితీల ఖర్చు కోసం 212.50 కోట్లు విడుదల చేస్తూ ఒక ఫైలుపై, 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి 162.50 కోట్లు విడుదల చేస్తూ మరో ఫైలుపై, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ పాండుబాబుకు సంబంధించి లక్ష మెడిక్లెయిమ్‌ను ఆయన భార్య రాజ్యలక్ష్మికి మంజూరు చేస్తూ మూడో ఫైలుపై సంతకం చేశారు.