Dharmaram | ధర్మారం,సెప్టెంబర్ 15 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామ శివారులోని దళితులకు చెందిన ఇనాం భూముల వ్యవహారంలో రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సంబంధం ఉందని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారని స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ సోషల్ మీడియా మాజీ మండల అధ్యక్షుడు దేవి నలినీకాంత్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యానికి ముందు నిజాం కాలంలోనే 1,347 సంవత్సరంలో ధర్మారం మండల కేంద్రానికి చెందిన దేవి పెద్ద లచ్చయ్య పేరిట బొమ్మ రెడ్డి పల్లి గ్రామ శివారులోని 679 సర్వే నెంబర్ లో 72 ఎకరాల భూమిని సుల్తానాబాద్ తహసీల్దార్ పట్టా ఇచ్చారని వారు వివరించారు. ఆ తర్వాత అట్టి భూమిని ఆయన వారసులు వాటాలుగా పంచుకోగా ఒక్కొక్కరికి కేవలం రెండెకరాలు వచ్చిందని వారు వివరించారు.
అట్టి భూమిలో 60 శాతం నిరుపయోగ కరమైన భూమి ఉండగా కేవలం 40 శాతం భూమి మాత్రమే సాగుకు యోగ్యంగా ఉండగా ఇన్నాళ్లు అట్టి భూమిలో తాము పంటలు పండించినట్లు వారు వివరించారు. ఆ తర్వాత భూములు పట్టాదారు పాసుబుక్కుల్లో నమోదయిందని వారు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే అట్టి భూములు విక్రయించడానికి 25.1.2014 లో పట్టాదారులకు ఓఆర్సీ జారీ చేసిందని వారు గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ధరణి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాం లో భూభారతిలో కూడా పట్టాదారు పేర్లు నమోదు అయినట్లు వారు వివరించారు. కానీ ఇట్టి భూమి వ్యవహారంలో రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. కానీ ఇటీవల అసెంబ్లీలో అట్టి భూమిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాజేసే ప్రయత్నం చేస్తే తాను కాపాడానని వ్యాఖ్యానించడం సరైంది కాదని వారు అన్నారు.
ఈశ్వర్ కు ఆ భూమి తో ఎలాంటి సంబంధం లేదని అనవసరంగా అసెంబ్లీలో హైలైట్ కావడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడినట్టు స్పష్టం అవుతుందని బీఆర్ఎస్ నాయకులు బలరాం రెడ్డి, శ్రీధర్, నలినీకాంత్ పేర్కొన్నారు. ఈశ్వర్ కు అట్టి భూమిలో భూమి ఉన్నట్లు మంత్రి నిరూపించాలని వారు సవాల్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా మంత్రి హోదాలో ఉన్న లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం సరైనది కాదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇంకా అట్టి భూమిని 22 ఎ నిషేధిత జాబితాలో చేర్చామని మంత్రి చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందని వారు ధ్వజమెత్తారు. ఆ భూమిలో కేవలం నిరుపేద దళితులకు మాత్రమే పట్టాలు ఉండటం వల్ల వారికి అన్ని హక్కులు ఉన్నాయని వారు స్పష్టం చేశారు.
మిగులు భూమిని ఎంత పంపిణీ చేశారో మంత్రి సమాధానం చెప్పాలి
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తానని డాంబికాలు పలికిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇప్పటివరకు మూడేళ్ల కాలంలో ధర్మపురి నియోజకవర్గంలో ఎంత భూమి పంపిణీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బొమ్మ రెడ్డిపల్లి, నర్సింగాపూర్ గ్రామాలలో అన్యాక్రాంతమైన భూములను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని గొప్పలు చెప్పుకుంటున్నా మంత్రి లక్ష్మణ్ కుమార్ అదే గ్రామాలలో ఎంతమంది నిరుపేదలకు భూమిని పంపిణీ చేశారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్ల కాలమైనప్పటికీ మరి ఇప్పటివరకు మిగులు భూములను నిరుపేదలకు మంత్రి ఎందుకు పంపిణీ చేయడం లేదు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేవలం మాజీమంత్రి ఈశ్వర్ ను బొమ్మరెడ్డిపల్లి శివారులోని 679 సర్వేనెంబర్ భూమిలో విషయంలో మాత్రం బదనాం చేయాలని లక్ష్మణ్ కుమార్ చేస్తున్నాడని వారు ఆరోపించారు.
22ఎ నిషేధిత జాబితాలో భూములు చేర్చడంతో ప్రజలకు ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వం పట్టా భూములను సైతం 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన పట్టాదారులు ఆందోళన గురవుతున్నారని వారు అన్నారు. 22 ఏ నిషేధిత జాబితాలో వ్యవసాయ భూములు ఉండటం వలన రైతులు యూరియా, డి ఏ పి ఎరువులు కొనలేని దృష్టికి ఏర్పడిందని వారు తెలిపారు. పట్టా భూములను 22 ఏ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పాలని, బొమ్మ రెడ్డి పల్లి శివారు 679 దళితుల భూమితో సంబంధం ఉందని మాజీ మంత్రి ఈశ్వర్ పై అనవసర విమర్శలు మంత్రి లక్ష్మణ్ కుమార్ చేస్తే సహించేది లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, కిలావనపర్తి ,మల్లాపూర్ సర్పంచులు మోతె కనకయ్య, మంద శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తుమ్మల రాంబాబు, పాకాల రాజయ్య, మిట్ట తిరుపతి, కాంపెల్లి చంద్రశేఖర్, గంధం తిరుపతి దేవి వంశీకృష్ణ, దేవి రాజేందర్ ,నాడెం శ్రీనివాస్, దేవి రాజారాం, దేవి అజయ్, నేరేళ్ల చిన్న లచ్చయ్య, అమరపెల్లి నారాయణ, ఆవుల వేణు, బొలిశెట్టి సుధాకర్, ఉప్పు శ్రీనివాస్, సులిగే శేఖర్, పుట్ట తిరుపతి, తోడేటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.