60 లక్షల కార్యకర్తల బలగమే కేసీఆర్ బలమని, రానున్న ఎన్నికల్లో అందరి ఆశీర్వాదంతో వంద సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వారి గుండెల్లో గూడుకట్టుకొని కేసీఆర్ ఉన్నారని, ఆయనను ఓడించే దమ్ము ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. దక్షిణ భారతదేశంలో మూడోసారి గెలిచి ముఖ్యమంత్రిగా రికార్డు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు కలిసి కట్టుగా ఉంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు తిరుగుండదని చెప్పారు. ఈ మేరకు బుధవారం ముస్తాబాద్ మండలంలోని మద్దికుట శివారులో 11 గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅతిథిగాహాజరై ప్రసంగించారు.
సిరిసిల్ల/ ముస్తాబాద్/ గంభీరావుపేట, ఏప్రిల్ 12 : బీఆర్ఎస్ కార్యకర్తల బలగమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బలమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ముస్తాబాద్ మండ లంలోని 11 గ్రామాలకు జరిగిన బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే తనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, ఈస్థాయి కల్పించిన ఇక్కడి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేని మంత్రి కేటీఆర్ విశ్వాసాన్ని చాటారు. తనకు జన్మనిచ్చింది కన్న తల్లి అయితే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల అని, ఈ గడ్డకు ఎంత సేవ చేసినా రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. ఎంత అభివృద్ధి, సంక్షేమం చేసినా తక్కువేనని, ఇక్కడి ప్రజలు బువ్వ పెడితేనే తనకు ఈస్థాయి అని తెలిపారు. తొలిసారి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేవలం 171 ఓట్లతో గెలుపొందానని, 2010లో సిరిసిల్ల ప్రజలందరి ఆశీర్వాదంతో 68 వేల ఓట్ల మెజార్టీతో గెలపించారని, రాష్ట్రం వచ్చాక 2014 ఎన్నికల్లో 54 వేల మెజార్టీతో గెలిపిస్తే, 2018 ఎన్నికల్లో 89 వేల ఓట్లు మెజార్టీ గెలిపించారని గుర్తు చేశారు.
రాష్ట్రం సాధించక ముందు సినిమాల్లో తెలంగాణ ఏర్పాటుపై జోకులు వేసుకునే పరిస్థితి ఉండేదని, ఇక్కడి నాయకులకు సమస్యలు పరిష్కరించే తెలివి లేదని ఉమ్మడి పాలకులు అపహాస్యం చేశారని గుర్తు చేశారు. కానీ, స్వరాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని, సంక్షేమం, అభివృద్ధితో జోడెడ్ల బండిలా కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. దేశంలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే వాటిలో 19 తెలంగాణకు చెందిన గ్రామాలు ఎంపికయ్యాయని వివరించారు. ఉమ్మడి పాలనలో కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ లేకపోతే వార్త అని వివరించారు. ఉమ్మడి పాలనలో అంత్యక్రియలకు సైతం కరెంట్ ఆఫీసులకు ఫోన్ చేసి స్నానాలు చేసేవారని, ప్రస్తుతం కరెంట్ నిరంతరాయంగా ఉంటుందని, ఇది కాదా అభివృద్ధికి నిదర్శనం అంటూ ప్రశ్నించారు. నాడు తాగునీటి కోసం ఎంతో గోస ఉండేదని, తాగునీటి సమస్య కారణంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లడానికి జంకేవారని, ప్రస్తుతం ప్రతి ఇంటి ముందు నల్లా కనెక్షన్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉంటూ పంట పెట్టుబడికి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. ఇంటింటా మొక్కలు పెంచేలా హరితహారం వంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను సీఎం పచ్చదనంతో నింపారని తెలిపారు. సమృద్ధిగా పెరిగిన భూగర్భ జలాలతో అన్నదాతలు భరోసాగా బతుకుతున్నారని, పింఛన్లు పది రెట్లు పెరిగాయని, పెరిగిన జలవనరులతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. కాళేశ్వర జలాలతో ముస్తాబాద్ మండలంలోని చీకోడు, మద్దికుంటలోని చెరువులు మత్తడి దుంకుతున్నాయని తెలిపారు. నట్టనడి ఎండాకాలంలో అపరభగీరథుడు సీఎం కేసీఆర్ గోదారమ్మను ఎదురెక్కించడంతో ఎగువమానేరు మత్తడి దుంకిందని తెలిపారు. అడగకున్నా నాలుగు లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చిన మనసున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఆర్బీఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూంపల్లి సురేందర్‌రావు, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, సర్పంచ్ భాగ్యశ్రీ పాల్గొన్నారు.
ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పరువు దేశమంతా తీస్తున్నడు. బీజేపీ నేతలు మసీదులు తవ్వకుండా కాలువలు తవ్వితే రైతులకు ప్రయోజనం ఉంటుంది. పునాదులు తవ్వితే ఇండ్లు నిర్మించవచ్చు. కానీ, గతాన్ని తవ్వితే పెంకాసులు వస్తయ్. బీజేపీ నేతలు వచ్చాకే గుడులు వెలిశాయా..? దేవుళ్ల పంచాయితీలతో పిల్లల మనసులు పాడు చేస్తున్నరు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నరు. ప్రజలకు చేసిన మంచిపనేంటో చెప్పాలి.
బీఆర్ఎస్ సంస్కారం ఉన్న పార్టీ. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటం. లక్షలాది మంది కార్యకర్తల కష్ట ఫలితమే ఈ పదవులు. నేల విడిచి సాము చేయకుండా కార్యకర్తల వద్దకు వెళ్లి కలవాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసినం. కార్యకర్తలను పార్టీ పరంగా ఆదుకునే బాధ్యత మాపై ఉన్నది.
రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 1.24 లక్షల నుంచి 3.17 లక్షలకు పెంచినం. స్థూల ఆదాయాన్ని 5 లక్షల కోట్ల నుంచి 13.27 లక్షల కోట్లకు పెంచినం. సాగుకు 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నం. దాదాపు 45 లక్షల పింఛన్లు ఇస్తున్నం. ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు సృష్టించినం. కానీ, మోదీ పాలనలో ఏ ఒక్కరికైనా లాభం జరిగిందా..? ఆయన ప్రజలకు ఏం చేశాడో చెప్పే దమ్ముందా..? తెలంగాణ విద్యాభివృద్ధికి కాలేజీలను మంజూరు చేసిండా..? తెలంగాణ కంటే మెరుగైన పాలన దేశంలో ఎక్కడుందో చెప్పాలి. జనధన్ ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? విదేశాల్లో నల్లధనం తెస్తానని చెప్పి తెల్ల ముఖం వేసిండు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని వారి కష్టాలను రెట్టింపు చేసిండు. సిలిండర్, పప్పు, నూనె, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి దేశాన్ని ఆగమాగం చేసిండు.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సీఎం కేసీఆర్ ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణను గొప్పరాష్ట్రంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపారు. ప్రభుత్వ పథకాలపై కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలి. పార్టీ కార్యకర్తల సంఘటితంతో మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు, దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నది. సీమాంధ్ర పాలనలో నిధులు, నియామకాలు రావడం లేదనే ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం. ఉద్యమంలో మీ అందరి పాత్ర ఎంతో ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్‌తో ఒరిగేదేం లేదు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం తప్ప మరోటి చేతకాదు. బండి సంజయ్ ఎంపీగా ఏం చేసిండు? రాష్ర్టానికి కాదు జిల్లాకు ఏమైనా తెచ్చిండా..? పార్లమెంట్లో కనీసం ఒక్క నిమిషమైనా మాట్లాడిన సందర్భాలున్నాయా..? మీరే ఆలోచించాలి.
– బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో పథకాలు అందుతున్నాయి. అధినేత కేసీఆర్ సూచనలతో సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ కార్యకర్తల సాధక బాధకాలు తెలుసుకోవడం, వచ్చే ఎన్నికల్లో విజయానికి ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై చర్చజరగాలి. సీఎం కేసీఆర్ పాలనలో బీడు వారిన రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది. స్వరాష్ట్రంలోనే అంబేద్కర్‌కు గుర్తింపు వచ్చింది. ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని టాంక్ బండ్ వద్ద దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.
– బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి
బీఆర్ఎస్ శ్రేణులంతా సమన్వయంతో కలిసి పనిచేద్దాం. రాబోయే ఎన్నికల్లో గులాబీజెండాను ఎగురవేద్దాం. సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశంలో పేర్కొన్న విధంగా ప్రతి కార్యకర్తా ముందుకు సాగాలి. పథకాలు, అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లు లేదు. కేసీఆర్ పాలనలో సర్పంచ్‌గా పనిచేస్తే బాగుండని అనిపిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను, ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించుకుందాం.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
మేం చాలా గరీబులం. నాకు ముగ్గురు పిల్లలు. నాభర్త షాదుల్ బ్యాండ్ కొడుతుండేవాడు. రెండు కిడ్నీలు ఖరాబైనయి. వైద్యానికి మస్తు బాకీలు చేసినం. కానీ, నా భర్త బతుకలేదు. నా భర్త పేరు 20 గుంటలు వ్యవసాయ భూమి ఉండె. గతంలోనే దివ్యాంగుడైన నా చిన్నకొడుకు చనిపోయిండు. నా బతుకుకు ఏ ఆధారం లేకుండా పోయింది. కష్టాల్లో ఉన్న నాకు రైతు బీమా ద్వారా సీఎం కేసీఆర్ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు. దాంతో వైద్యానికి చేసిన బాకీలు కట్టుకున్నం. నా బాధలు కొంత తీరినయి. ఇపుడు నాకు బతుకు కష్టమైతుంది. కేటీఆర్ సార్ ఆదుకోవాలి.
– అప్సానా, రైతు బీమా లబ్ధిదారురాలు (ముస్తాబాద్)
సారూ.. తెలంగాణల ఎప్పటికీ మీ ప్రభుత్వమే ఉండాలి. మా జీవితాంతం మీకే మద్దతునిస్తాం. సమైక్య పాలనలో చెప్పలేనన్ని బాధలు పడ్డం. తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే సంతోషంగా బతుకుతున్నాం. ఎవుసానికి నిరంతర కరెంట్, సాగుకు పుష్కలంగా నీళ్లు ఉన్నయి. అప్పటి పాలనలో కరెంట్ లేక చానా కష్టాలు పడ్డం. రాత్రి పూట కరెంట్ కోసం బావిల కాడికి పోయి ఎంతోమంది రైతులు చచ్చిపోయారు. ఇపుడు ఆ బాధ లేదు. రైతుకు ఏం కావాలో కేసీఆర్ సార్ అది చేత్తండు. రైతు బంధు కూడా ఇత్తండు. ఇక మాకేం రంది.
– ఎల్సాని దేవయ్య, రైతు (ముస్తాబాద్)
మంత్రి కేటీఆర్ మానవత్వానికి ప్రతిరూపం. మన భవిష్యత్తుకు భరోసా. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల కోసం ఆలోచన చేసి సమ్మేళనాలు నిర్వహించలేదు. పార్టీ కార్యక్రమంలా కాకుండా కుటుంబ సభ్యుల వలె అంతా ఒకచోట చేరి పండగలా సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తనదిగా, పల్లెలు తన సొంత గ్రామంగా భావిస్తారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలూ ఆలోచిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆపదవచ్చిందంటే ‘నేనున్నానంటూ’ సాయం అందిస్తారు. రాష్ర్టానికి కేటీఆర్ ఎంతో ధైర్యం. తన జన్మదినోత్సవాన్ని కూడా నిరాడంబరంగా జరుపుకోనే ఏకైక నాయకుడు ఆయన. – జనగామ శరత్‌రావు, ఎంపీపీ (ముస్తాబాద్)