మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిని చాటారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ఎంతో మందికి సాయమందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రెండు నిరుపేద కుటుంబాలకు సొంతిండ్లు కట్టించారు. అమాత్యుడు రామన్న బర్త్ డే సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద కానుకగా అందించారు. అంతర్గాం మండలం గోలివాడకు చెందిన నిరుపేద ఒంటరి మహిళ గాదె రాజమ్మతోపాటు రామగుండం 28వ డివిజన్ హనుమాన్‌నగర్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్ సలీంకు ఇండ్లను కట్టించి, సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల కేటీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. సకల దేవతాల ఆశీస్సులతో కేటీఆర్ నిండు నూరేండ్లు వర్ధిల్లాలని కోరుకున్నారు. కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు తన సొంత డబ్బులు 5 లక్షలతో 300కు పైగా టార్పాలిన్ కవర్లను కొనుగోలు చేసి, 33 డివిజనల్లో పేదలకు అందజేశారు. మరోవైపు అభిమానులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. సర్కారు బడిలో పిల్లలకు నోట్ బుక్కులు పంపిణీ చేశారు.