కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రైతన్న కోసం కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ మరో యుద్ధానికి సిద్ధమైంది. యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని అమీ తుమీ తేల్చుకునేందుకు నేటి నుంచి వరుస ఆందోళనలు చేపడుతోంది. రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లి వచ్చినా, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాసినా ఎలాంటి స్పందనా రాకపోవడం.. అన్ని స్థానిక సంస్థలు ఏకగ్రీవ తీర్మానాలు చేసినా కేంద్రం వడ్ల కొనుగోలుకు గీకరించకపోవడంతో కేంద్రంతో టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి నిరసన దీక్షలు చేపడుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుండగా, రైతాంగం వారి వెంట నిలుస్తున్నది.
రాష్ట్ర రైతాంగం పండించిన వడ్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది. ఆహార భద్రత చట్టాన్ని అనుసరించి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వచ్చే వ్యవసాయ దిగుబడులను భేషరతుగా కొనుగోలు చేయాల్సిన కేంద్రం.. తెలంగాణ ధాన్యం విషయంలో తీవ్రమైన వివక్ష చూపుతోంది. రాష్ట్ర రైతులు యాసంగిలో సాగు చేసే వడ్లను బాయిల్డ్ బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యాసంగిలో మాత్రం తాము కొనలేమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ససేమిరా అంగీకరించడం లేదు. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉంది. తాజాగా, సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గోయల్‌ను కలిసి విన్నవించారు.
కొనేదే లేదని తేల్చి చెప్పిన పీయూష్ గోయల్ చివరికి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యానించారు. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయినా, ఎలాంటి స్పందనా కనిపించ లేదు. కేంద్రం యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని చివరికి జిల్లా, మండల ప్రజా పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, సింగిల్ విండోలు, రైతుబంధు సమితులు, మున్సిపాలిటీలు సైతం ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. అయినా, కేంద్రం మొద్దు నిద్ర వీడలేదు. దీంతో టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపుతో సోమవారం నుంచి ఈ నెల 11 వరకు రైతుల పక్షాన పోరాడాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నారు.
దిగి వచ్చేదాకా ప్రత్యక్ష పోరాటమే..
దండగ అన్న వ్యవసాయాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలా తీర్చిదిద్దింది. 24 గంటల ఉచిత విద్యుత్, పంట పెట్టుబడికి రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటకు కావాల్సిన నీరు అందుబాటులోకి తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా ఎదిగింది. దేశానికే దిక్సూచీగా మారుతున్న రాష్ర్టాన్ని దెబ్బతీసేందుకు వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని టీఆర్ఎస్ మండిపడుతోంది. ఆత్మహత్యలు, అప్పుల బాధల నుంచి బయటపడుతున్న రాష్ట్ర రైతులు ఇప్పుడిప్పుడే తమ కష్టాలు తొలుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది.
ఈ నేపథ్యంలో రైతులను కాపాడుకునేందుకు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమైంది. వారి పక్షాన ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. కేంద్రం దిగివచ్చి యాసంగి వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా, స్థానిక బీజేపీ నాయకుల వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రులతో, ప్రధానితో ఎందుకు మాట్లాడలేక పోతున్నారని నిలదీస్తున్నారు.
పార్టీ శ్రేణుల సమాయత్తం
కేంద్ర ప్రభుత్వంతో రాజీ లేని పోరాటలకు సిద్ధపడుతున్న టీఆర్ఎస్ చేపట్టే వరుస ఆందోళనలు, నిరసనల కోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆ పార్టీ కార్యకర్తలు సమాయత్తమయ్యారు. ఈ మేరకు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల సూచన మేరకు సోమవారం మండల కేంద్రాల్లో జరిగే నిరసన దీక్షల కోసం కార్యకర్తలు రైతులను సమీకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ మండలాధ్యక్షులు, గ్రామ నాయకులు ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల సెగ తగిలేలా దీక్షలు చేపడుతున్నామని పార్టీ అధ్యక్షులు స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్లో జరిగే నిరసన దీక్షలో మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గంగాధరలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, హుజూరాబాద్‌లో నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, ఇల్లందకుంటలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సైదాపూర్‌లో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు పాల్గొంటున్నారు.
న్యాయం జరిగేదాకా ఆందోళనలు
యాసంగి వడ్ల కొనుగోలులో కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరిని ఎండగడుతాం. వడ్లు కొనే వరకు రైతుల పక్షాన పోరాడుతాం. ధాన్యం కొనుగోలు విషయంలో కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. రాష్ట్ర మంత్రులు వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. చివరికి సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాసినా స్పందించలేదు. దీనిని బట్టి కేంద్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత కక్ష. ఎందుకింత వివక్ష. ఏ రాష్ట్రంనుంచైనా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం ప్రకారం కేంద్రానిదే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదనేది ఇక్కడ సమస్య కాకూడదు. దేశ సంరక్షణ, ఆహార భద్రత విషయంలో రాజకీయాలు చేయకూడదు. కానీ, కేంద్రంలోని బీజేపీ ఈ విషయంలో పక్కా రాజకీయాలు చేస్తోంది. అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఆందోళనలు చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా రైతులకు న్యాయం చేయాలన్నదే మా పార్టీ ఉద్దేశం.
– టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ం దిగివచ్చే వరకు పోరాడుతాం. పంజాబ్ రాష్ట్రంలో పూర్తిగా కొనుగోలు చేస్తున్న కేంద్రం.. మన రాష్ట్రంలో ఎందుకు కొనదు. ఏడాది కాలంగా రాష్ట్ర రైతాంగాన్ని గోస పెడుతున్నది. కేంద్రం వైఖరి వల్ల ఇప్పటికే యాసంగిలో చాలా మంది రైతులు వరి సాగు చేయలేదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో ధాన్యం కొనబోమంటూ రైతును నిండా ముంచాలని చూస్తున్నది. ఇప్పటికే రైతులు సగం నష్టపోయారు. ఇప్పుడు కేంద్రం చేస్తున్న అన్యాయం వల్ల పూర్తిగా నష్టపోతారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి ఇలా చేయడం బాధాకరం. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసే వరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తాం. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కేంద్రం చేస్తున్న మోసాన్ని, వివక్షను రైతులకు వివరించి వారందరినీ ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. ప్రతి కార్యకర్త ఒక నాయకుడిగా మారి తన పరిధిలో ఉద్యమించాలి.
– టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
బరిగీసి కొట్లాడుతాం
రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేటి నుంచి దండయాత్ర మొదలవుతున్నది. కేంద్రం వడ్లు కొనేదాకా వదిలేది లేదు. ఉద్యమాలు, పోరాటాలు తెలంగాణ బిడ్డలకు కొత్త కాదు. అవమానాలు, అవహేళనలు అప్పుడు చూశాం.. ఇప్పుడు చూస్తున్నాం. బరిగీసి కొట్లాడుతాం. తెలంగాణ తెచ్చుకున్న తీరుగనే బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తం. దీనికి పెద్దపల్లి జిల్లాలోని ప్రతీ పల్లె సెగ కేంద్రానికి తగిలే విధంగా ఉద్యమిద్దాం. జిల్లాలోని రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు పూనుకోవాలి. పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశాం. కేంద్రంలోని బీజేపీ దిగివచ్చేదాకా ఉద్యమం ఆపేది లేదు.
– టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ధాన్యం కొనేదాకా ఉద్యమిస్తాం
రాష్ట్ర రైతాంగం యాసంగిలో పండించిన వరి ధాన్యం కేంద్రం కొనే వరకు కొట్లాడుతాం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మాదిరిగానే ఇప్పుడూ నిరసనలు, రాస్తారోకోలు చేపడతాం. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉండడం కేంద్రం ఓర్వలేకపోతున్నది. రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్నది. ఇతర రాష్ర్టాల్లో పండిన పంటలను ఎలాగైతే కొనుగోలు చేస్తుందో తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని కూడా కేంద్రం భేషరతుగా కొనుగోలు చేయాల్సిందే. కేంద్రం కొనేదాకా పోరాటం ఆపేది లేదు. సోమవారం మండలాల్లో నిర్వహించే నిరసన దీక్షలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పాల్గొనాలి.
– టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
మరో మహోద్యమానికి సిద్ధం కావాలి
తెలంగాణ ఉద్యమ తరహాలో కేంద్ర సర్కారుపై మరో మహోద్యమానికి సిద్ధం కావాలి. ఇప్పటికైనా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే పార్టీ రైతులకు బాసటగా నిలవాలి. పంజాబ్‌లో మాదిరిగా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేదాకా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధం కావాలి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. కార్యాచరణలో భాగంగా 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలి. 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న నియోజక వర్గాల్లోని అన్ని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలి. ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేయాలి. బైక్ ర్యాలీలు నిర్వహించాలి. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి.