జగిత్యాల, డిసెంబర్ 5 : ఈ నెల 7న జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ జీ రవి, ఎస్పీ సింధూశర్మతో కలిసి సమీకృత కలెక్టర్ కార్యాలయం, మోతె సభా స్థలం, వైద్య కళాశాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఏమైనా పనులు మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు.
పర్యటన ఆద్యంతం సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. అంతకు ముందు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమీక్షించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు మందా మకరంద్, బీఎస్ లత, తదితరులు పాల్గొన్నారు.