వెల్గటూర్, నవంబర్ 24: ‘ఓట్ల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని చెబుతూ వచ్చే ఆపద మొక్కులోళ్లను నమ్మొద్దు. అంగీలు చింపుకొని కూడా వస్తరని నమ్మితే గోసపడుతరని’ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. శుక్రవారం వెల్గటూర్ మండలం మొక్కట్రావుపేట, ముత్తునూర్, రాంనూర్, చెగ్యాం, తాళ్లకొత్తపేటలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా, ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మ, కోలాళాటలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చేవన్నీ దొంగ హామీలేనని, చెప్పేవన్నీ ఝూటా మాటలేనని దుయ్యబట్టారు. వారి హయాంలో భూమి శిస్తూ, నీటి పన్ను, రుణాలు కట్టకపోతే ఇంటి దర్వాజలు పీక్కపోయిన చరిత్ర వారిదన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీటి పన్ను రద్దు చేయడమేకాదు రుణ మాఫీ చేసి ఆదుకున్న గొప్ప మనుసున్న నాయకుడని కొనియాడారు. ‘ నేను మీ సేవకుడిని. ఆపదొస్తే ఆదుకుంటా. కష్టమొస్తే వెన్నంటి నిలుస్తా. నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా. మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని’ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో మొక్కట్రావుపేట గ్రామానికి సంబంధించి 97 ఇండ్లు మాత్రమే మునిగిపోతే, ప్రభుత్వంతో మాట్లాడి గ్రామాన్ని మొత్తం ముంపుగా ప్రకటించి, 413 మందికి రూ.3 లక్షల చొప్పున రూ.14.28 కోట్ల పరిహారం ఇప్పించినట్లు చెప్పారు. స్థానిక నాయకుల మీద కోపం ఉంటే స్థానిక ఎన్నికల్లో చూసుకోవాలి కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నాయకులు అధికారానికి దూరమై పదేండ్లు కావడంతో ఆగలేక ఆవురావురంటూ దొంగ హామీలు, ఝూటా మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఊర్ల మీద పడి దోచుకోవడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారు అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటల కరెంట్, 10 హెచ్‌పీల మోటర్లు పెడతారన్నారు. మూడు గంటలిచ్చే ఆ పార్టీ కావాలా..? 24 గంటలు ఉచిత విద్యుత్ అందించే బీఆర్ఎస్ కావాలా..? మీరే ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలోనే మొక్కట్రావుపేట, రాంనూర్, తాళ్లకొత్తపేట, చెగ్యాం గ్రామాల్లో మిగిలిన ముప్పు సమస్యలను పరిష్కరించుకుందామని, మన తల్లీ లాంటి పార్టీ బీఆర్ఎస్ కా రు గుర్తుకు ఓటేసి తనను గెలిపించి, మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
ఇక్కడ జడ్పీటీసీ బొడ్డు సుధారాణి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చల్లూరి రాంచందర్‌గౌడ్, సర్పంచ్‌లు ఆగండ్ల తిరుపతి, అనుమాల తిరుపతి, రామిళ్ల లావణ్య-సనిల్, ద్యావనపల్లి లక్ష్మి-ఎల్లయ్య, గంపల నగేశ్, ఎంపీటీసీ మూగల రాజేశ్వరి-సత్యం, గాజుల మల్లేశం, సీనియర్ నాయకులు గండ్ర రంగారా వు, గండ్ర సుధీర్‌రావు, పోనుగోటి రామ్మోహన్రావు, గూడ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ సంగ జయ-రమేశ్, మా జీ ఎంపీటీసీ కండ్లే భాగ్య, మండల యూత్ అద్యక్షులు బిడారి తిరుపతి, కుసనపల్లి రవి, కోమటిరెడ్డి సింధూజరెడ్డి, ఎనగందుల తిరుపతి, నర్సయ్య, గౌరు తిరుపతి, అనిల్, కోల చరణ్, ధర్మాజీ సతీశ్, శ్రీను ఉన్నారు.