అంధత్వాన్ని పూర్తిగా దూరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రెండో విడుత కంటి వెలుగును ప్రారంభిస్తున్నది. దీనిని ప్రత్యేక ప్రణాళికతో నిర్వహించాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టి కృషితో విజయవంతం చేయాలి. వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా డప్పు చాటింపు చేయించాలి. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే గొప్ప చరిత్రను లిఖించబోతున్నది. పెద్దపల్లి జిల్లాలో 34 బృందాల ద్వారా 100 పని దినాల్లో శిబిరాలు నిర్వహిస్తాం. కార్యక్రమం అమలులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలి.
– కంటి వెలుగుపై పెద్దపల్లి జిల్లా సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్
దృష్టిలోపం ఎందరికో శాపం. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం ఉంది. కానీ, ఆదిలోనే గుర్తిస్తే కండ్లను కాపాడుకోవచ్చు. అందుకే దృష్టి లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారి కళ్లల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు కంటివెలుగును తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి రెండో విడుతను ప్రారంభించి, వంద రోజులపాటు శిబిరాలు నిర్వహించబోతున్నది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి, అవసరమున్న వారికి అద్దాలు, మందులు ఇవ్వడంతోపాటు ఆపరేషన్లు చేయనున్నది. ఈ కార్యక్రమం పేద, మధ్యవర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడనున్నది.
పెద్దపల్లి, జనవరి11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంధత్వాన్ని పూర్తిగా దూరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి కంటి వెలుగు చేపడుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. రెండో విడుతను అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో విజయవంతం చేద్దామన్నారు. రాష్ట్ర సర్కారు మరోసారి ప్రారంభించనున్న ఈ కార్యక్రమం ప్రపంచంలోనే గొప్ప చరిత్రను లిఖించబోతున్నదని చెప్పారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల ప్రధాన అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులతో ‘కంటి వెలుగు’పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాలో 34 బృందాల ద్వారా 100 పని దినాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
క్యాంపులను జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా తనిఖీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారి కళ్లల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొచ్చిందని చెప్పారు. గ్రామీణుల చిన్న చిన్న సమస్యల పరిషారానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఓ ప్రముఖ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని దృష్టి లోపం సమస్యలు 50 శాతం మేర భారతదేశంలో ఉన్నారని, నిర్లక్ష్య ధోరణి కారణంగా సమస్య తీవ్రతరమయ్యే వరకు తెలియదన్నారు. వృద్ధులకు కంటి సమస్యలు అధికంగా ఉంటాయని, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దవాఖానకు వెళ్లరని, అలాంటి లక్షలాది ప్రజలకు కంటి వెలుగు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గతంలో నిర్వహించిన కంటివెలుగు ద్వారా కోటి 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం రెట్టింపు బృందాలను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించేలా ఈ నెల 18 నుంచి 100 పనిదినాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, వారి పరిధిలో క్యాంపుల నిర్వహణ షెడ్యూల్ తెలుసుకోవాలని సూచించారు.
ప్రతి ఒకరూ కంటి పరీక్ష చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలని, ఎన్ని పనులున్నా ఆరోజు వీలు చేసుకొని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. శిబిరాలు నిర్వహించే విషయం తెలియజేస్తూ డప్పు చాటింపు చేయించాలని, కార్యక్రమం అమలులో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువాలని పిలుపునిచ్చారు. కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ కంటి వెలుగు శిబిరాలలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు, కంటివెలుగు మెడికల్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. గతంలో నిర్లక్ష్యం పాలైన సర్కారు వైద్యాన్ని బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. సర్కారు దవాఖానలన్నీ కార్పొరేట్‌ను తలపించేలా ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగుపరిచింది. తాజాగా, మరోమారు కంటి వెలుగును అమలు చేయనున్నది. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు అమలు చేయలేదు. కేవలం తెలంగాణ సర్కార్ మాత్రమే సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేస్తున్నది.
– పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత
గతంలో ఏ ప్రభుత్వాలైనా ఇలాంటి పథకాల గురించి, కార్యక్రమాల గురించి ఆలోచించాయా..? లేదు. ఇది కేవలం సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనకు ప్రతి రూపం. ప్రతి ఇంటిలో 40 ఏళ్లు పైబడిన వారు అంధత్వ సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి వారందరి సమస్యను తీర్చడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది చారిత్రాత్మకమైనది. అధికారులు, ప్రజా ప్రతినిధులు సొంత కార్యక్రమంగా భావించి ప్రజలకు మేలు చేయాలి. విజయవంతం చేయాలి.
-పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
రాష్ట్రంలో అంధత్వాన్ని నిర్మూలించడమే భాగంగా సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా మారి కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంతో యావత్ తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులు విరబూస్తాయి. అంధత్వంతో బాధపడుతున్న జీవితాల్లో ఈ కార్యక్రమం వెలుగులను నింపుతుంది. వయోజనులు, వృద్ధులకు ఇది గొప్ప మేలు చేస్తుంది. ప్రజలకు మేలు చేసేందుకు, సేవలందించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులకు లభించిన బృహత్తర అవకాశం. గొప్పగా సేవ చేసి ప్రజల్లో మెప్పు పొందాలి.
-పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండో విడుత అమలు చేస్తున్నది. 18 ఏళ్లు నిండిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీగా పనిచేయాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జిల్లా స్థాయిలో నేను, డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి రోజువారి కంటి వెలుగు కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తాం.
-పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ