జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మంగళవారం ఊరూరా జెండా పండుగ అంబరాన్నంటింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు కన్నులపండువలా సాగాయి. ఉదయాన విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయ జయ నినాదాల నడుమ ఊరూవాడా త్రివర్ణ పతాకాలు ఎగిరాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సంబురాలు హోరెత్తాయి. మంత్రి గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నది. ఆ తర్వాత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అలరించగా, మైదానమంతా దేశభక్తి వెల్లివిరిసింది.
కలెక్టరేట్/కమాన్చౌరస్తా, ఆగస్టు15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం నిర్వహించిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ గోపీ, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రపుల్ దేశాయ్ వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం, పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సాంసృతిక ప్రదర్శనలు అలరించాయి. జిల్లా కేంద్రంలోని మానేరు, మానకొండూర్ జడ్పీ హైస్కూల్ బాయ్స్, సెయింట్ జార్జ్ ఇంటన్నేషనల్, టీఎస్ఎంఎస్ మానకొండూర్, పారమిత పాఠశాల, జీహెచ్ఎస్ మంకమ్మతోట, ఎస్ఆర్ పాఠశాలల విద్యార్థుల దేశభక్తి గీతాలపై నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా, విద్యార్థులు ప్రత్యేక వేషధారణల్లో అలరించారు.
వివిధ శాఖల చెందిన శకటాలు కనువిందు చేశాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, మహిళా, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ, చేనేత జౌళి శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 102, 108, పశుసంవర్ధక శాఖ, మున్సిపల్ శాఖలకు చెందిన శకటాలను అందంగా ముస్తాబు చేసి తీసుకురాగా ఉత్తమ శకటాలను ఎంపిక చేసి, మంత్రి గంగుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన 18 మందికి నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు. ఒక్కో వాహనం రూ.1.30లక్షల విలువ ఉంటుందని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి సీహెచ్. సంధ్యారాణి తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని 62 స్వయం సహాయక సంఘాలకు రూ.5.12కోట్ల చెక్కులు పంపిణీ చేశారు.
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
పలువురు స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి గంగుల, అధికారులు నాయకులతో కలసి ఘనంగా సన్మానించారు. ఇందులో బుర్ర వెంకటరాజం(వల్బాపూర్), బీరం కనకారెడ్డి (మొగిలిపాలెం), ఎ రాజలింగయ్య(ఎల్లంపల్లి), కే రాజిరెడ్డి (కనుకుల గిద్దె), భూపతి జనార్దన్(ఎలబోతారం), పంజాల ఓదేలు (చెల్పూర్), కే జనార్ధనాచారి(హుజూరాబాద్), పోచ వేంకటమ్మ (గొడిశాల), బొల్లవరపు భాస్కర్ రావు, ఎర్రబెల్లి రంగారావు, హెచ్ మల్లయ్య(కరీంనగర్) తదితరులు ఉన్నారు.