కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 12: ‘ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగరేయాలి. జాతీయ వాద భావజాలంతో పని చేయాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ నుంచి టవర్‌సర్కిల్ వరకు పాదయాత్రగా వెళ్లారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం టవర్ సర్కిల్లో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, నెహ్రూలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ చైనా ఆలోచనలను అమలు చేసే వ్యక్తని, చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై ఆయన నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని, అలాగే ఎందరో మహానీయులు దేశం కోసం బలిదానం చేశారని గుర్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం నెహ్రూ కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చరిత్రను తెరమరుగు చేసే కుట్రలు చేశారని ఆరోపించారు.
దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసేందుకే మోదీ ఆదేశాల మేరకు ప్రతి ఏటా హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం, సెమినార్లు నిర్వహించడం, దేశం కోసం త్యాగం చేసిన మహానీయుల విగ్రహాలను శుద్ధి చేసి పుష్పార్చన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు గండ్ర నళిని పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 12 : గడిచిన పదేళ్లలో కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం 6వ డివిజన్లోని పాతబజార్ ప్రాంతంలో రూ.27 లక్షలతో చేపట్టే ఎస్డబ్ల్యూ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టి సమస్యలు పరిషరించామని గుర్తు చేశారు.
పెండింగ్ పనులేమైనా ఉంటే వాటిని దశల వారీగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో వచ్చిన నిధులతో నగర రూపురేఖలు మార్చి సుందరంగా మార్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కార్పొరేటర్లు కోల మాలతి సంపత్, నాంపల్లి శ్రీనివాస్, నక పద్మ కృష్ణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కస్టమర్కేరని ఫోన్ చేస్తే లక్షా 50వేలు మాయం
జమ్మికుంట, ఆగస్టు12: ఆన్లైన్ లావాదేవీల్లో ఓ వినియోగదారుడు మోసపోయాడు. గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేసి నిండా మునిగాడు. అడిగిన వివరాలన్నీ చెప్పి దాదాపు లక్షా 50వేలు నష్టపోయాడు. జమ్మికుంట పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందిన పంజాల తిరుపతి తన ఫ్రెండ్‌కు ఆంధ్రాబ్యాంకు (యూనియన్ బ్యాంకు) ఖాతా నుంచి కొంత డబ్బును ఫోన్ పే ద్వారా పంపించాడు.
అయితే ఆ డబ్బు ట్రాంజాక్షన్ కాకపోవడంతో ఆందోళన చెందాడు. ఆంధ్రాబ్యాంకు కస్టమర్‌కేర్‌కు సంబంధించిన నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అందులో ఓ నంబర్ తెలుసుకుని ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ నుంచి మాట్లాడిన వారు అడిగిన వివరాలన్నీ తిరుపతి చెప్పాడు. తర్వాత తన ఖాతా నుంచి లక్షా 40వేల 999 కట్ అవడంతో లబోదిబోమన్నాడు. ఇది సైబర్ మోసమని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ సీఐ రవి కేసు నమోదు చేశారు.