Gurukul Vidyalayas | ధర్మారం, జులై 6: జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించటానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ గురుకులాల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గురుకులాల కాంట్రాక్టర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు పలు సమస్యలను మంత్రి లక్ష్మణ్ కుమార్ కు విన్నవించారు. ఈ సందర్భంగా నర్సింగారావు మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలలో గతంలో ఉన్న విధంగానే పాత టెండర్ విధానాన్ని కొనసాగించాలని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సెంట్రలైజ్డ్ టెండర్ విధానాన్ని అమలు అమలుపరిస్తే దీనిపై ఆధారపడిన 5వేల మంది ఆధారపడే కాంట్రాక్టర్స్ ఉపాధి కోల్పోతారని ఆ విధానాన్ని అమలు చేయవద్దని ఆయన కోరారు.
అదేవిధంగా కోడిగుడ్ల టెండర్లను కార్పోరేట్ వ్యాపారులకు అప్పగించవద్దని, రోజువారీ మెనూలో అమలులో ఉన్న ప్రకారం ఆరోజు వన్ డే కూరగాయలకు బదులుగా అవి లభించని పక్షంలో మరో కూరగాయలను వండడానికి అవకాశం కల్పించాలని, వంట సిబ్బంది దూర ప్రాంతం నుంచి రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విద్యాలయాలలోని సౌకర్యాలు కల్పించాలని నర్సింగ్ రావు మంత్రి కి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గురుకుల కాంట్రాక్టర్స్ చేసిన సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. సాధ్యమైనంతవరకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయన వారికి అభయం ఇచ్చారు.
తమ ప్రభుత్వం గురుకులాలో చదివే విద్యార్థుల డైట్ ఛార్జీలను గణనీయంగా పెంచడంతో వారికి నాణ్యమైన ఆహారం అందుతుందని లక్ష్మణ్ కుమార్ అన్నారు. తాను మంత్రి పదవి చేపట్టిన తర్వాత పెండింగ్ లో ఉన్న మూడు నెలల బిల్లులను విడుదల చేయించానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతరం గురుకుల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్ కుమార్ ను సన్మానించారు.
ఆర్ఎంపీల సంఘం ఆధ్వర్యంలో..
ధర్మారం మండల ఆర్ఎంపీల సంఘం సభ్యులు లక్ష్మణ్ కుమార్ ను సన్మానించి వినతిపత్రం సమర్పించారు. ఎర్రగుంటపల్లి లో ఉన్న ఆర్ఎంపీ భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్, నీటి వసతి కోసం బోర్వెల్ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ధర్మారంలో పీరీలను నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ను వారు స్థానిక మైనార్టీ సభ్యులు కోరారు.
అనంతరం ఆయన మండల కేంద్రంలో పీరీలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామానుజం, ఉపాధ్యక్షుడు ఐరిపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఆర్ఎంపీల మండల అధ్యక్షుడు పుచ్చకాయల మునీందర్, కార్యదర్శి సామల సత్యనారాయణ, కోశాధికారి కుంటూరి ప్రతాప్, ధర్మారం మసీద్ కమిటీ అధ్యక్షుడు ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు.