ముకరంపుర, నవంబర్ 15: కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారంలోని శక్తిమురుగన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లను మంగళవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు పరిశీలించారు. తూకం, కొనుగోళ్లలో అనుసరిస్తున్న విధానాన్ని, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. గ్రామాల నుంచి రైతులు మిల్లుకు తెచ్చిన పత్తి నాణ్యతను పరిశీలించి, ధర గురించి అడిగి తెలుసుకోగా క్వింటాలుకు రూ.8,700 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్లు వివరించారు.
చైర్మన్ సూచన మేరకు మిల్లు నిర్వాహకులు క్వింటాలుకు రూ.100 చొప్పున రైతులకు అదనంగా చెల్లించారు. వరంగల్, జమ్మికుంట మార్కెట్ల ధరలను ప్రామాణికంగా తీసుకుని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర చెల్లించాలని మిల్లు యజమానులకు సూచించారు. ఆయన వెంట వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి పురుషోత్తం ఉన్నారు.