మెట్పల్ల్లి, జనవరి15: మెట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ ఆసిఫొద్ద్దీన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఆరు నెలల క్రితమే వచ్చారు. ఆయన విధుల్లో చేరినప్పటి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన నిజామాబాద్ నుంచి వచ్చి వెళ్తారని, వేళాపాలా పాటించరని, ప్రతి ఫైల్‌కు ఐదు వేలకుపైగా లంచం ఇవ్వాల్సిందేనని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సేల్‌డీడ్, గిఫ్ట్‌డీడ్, మార్టిగేజ్ డీడ్, డాక్యుమెంట్ కాన్సిల్డీడ్, మరేదైనా కావచ్చు.. రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రతి దానికీ ఓ రేటు ఉంటుందని, అడిగినంత ఇవ్వాల్సిందేనని, లేదంటే రిజిస్ట్రేషన్ కాదనే ఆరోపణలున్నాయి.
అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిసరాల్లో ఉన్న దస్తావేజులేఖరు(డాక్యుమెంట్ రైటర్లు)ల ద్వారా వసూళ్లకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలం డబ్బ గ్రామంలో ఆబాది స్థలాన్ని ఓ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన విషయం చర్చనీయాంశమైంది. గ్రామస్తులు అప్రమత్తమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను రద్దు చేసినట్లు తెలిసింది. ఆ సబ్ రిజిస్ట్రార్ లంచం ఇస్తే సరైన పత్రాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తారనే ప్రచారం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో బుధవారం ఓ వ్యక్తిని ఇంటి స్థలం రిజిస్ట్రేషన్, మార్టిగేజ్ కోసం లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోవడం ఆరోపణలకు బలం చేకూర్చింది.
ఆ అధికారి తీరుపై మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎక్కడైనా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తారని, కానీ ఇక్కడ మాత్రం డాక్యుమెంట్ రైటర్లే చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని డీడ్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించే స్టాంప్‌డ్యూటీ కంటే దస్తావేజులేఖరులకు, సబ్‌రిజిస్ట్రార్‌కు, కింది స్థాయి సిబ్బందికి ఇచ్చే ఖర్చులే తడిసి మోపెడవుతున్నాయని వాపోతున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి సుంకే విష్ణు మెట్పల్లి సాయిరాంనగర్ కాలనీలో 266 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇంటి స్థలం సేల్‌డీడ్, మార్టిగేజ్ రిజి్రస్ట్రేషన్ కోసం ఓ దస్తావేజులేఖరితో దస్తావేజులను (డాక్యుమెంట్) తయారు చేయించారు. గత నెల 28న ఆ దస్తావేజు లేఖరి వద్ద సహాయకుడిగా పనిచేసే ఆర్మూరు రవి సదరు దస్తావేజులను సబ్‌రిజిస్ట్రార్ మహ్మద్ ఆసిఫొద్దీన్ వద్దకు తీసుకెళ్లాడు. సేల్‌డీడ్, మార్టిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు 10 వేలు ఇవ్వమని సబ్‌రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అయితే విష్ణు డబ్బులు ఇవ్వకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయకుండా పక్కన పెట్టారు. లంచం అంత ఇచ్చుకోలేనని, 5వేలు ఇస్తానని విష్ణు చెప్పడంతో అంగీకరించారు.
కాగా, అన్ని సక్రమంగా ఉండి కూడా లంచం ఇచ్చేందుకు ఇష్టపడని విష్ణు, ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు దస్తావేజులేఖరి సహాయకుడి ద్వారా 5 వేలు సబ్‌రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళ్లగా, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్న బానోత్ రవికుమార్‌కు ఇవ్వాలని సూచించారు. అటెండర్‌కు డబ్బులు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వెంటనే సబ్ రిజిస్ట్రార్, అటెండర్‌తోపాటు దస్తావేజు లేఖరి సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి చేతి వేలి ముద్రల ఆధారంగా రసాయన పరీక్షలో అవి లంచం డబ్బులేనని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ముగ్గురి నిందితులను కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణామూర్తి తెలిపారు.