ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళల్లో చైతన్యం మూర్తీభవిస్తున్నది. ప్రతి రంగంలోనూ పురుషులకు దీటుగా మహిళా లోకం పోటీ పడుతున్నది. అటు రాజకీయ, ఇటు పరిపాలనా రంగం ఏదైనా సరే.. మేమేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నది. ఇల్లును చక్కదిద్దుతూనే.. సమస్త ఇంటిల్లిపాదికి అండగా నిలుస్తున్నది. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లు, కష్టాలు, కన్నీళ్లు అన్నింటినీ అధిగమించడంలో తనకు తానే మేటిగా నిలుస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తన సత్తా, సామర్థ్యాన్ని చాటుతున్నది. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణిస్తూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖ్యాతిని నలుమూలలా ఎగురవేస్తున్న తీరుపై ప్రత్యేక కథనం.
– కరీంనగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): మహిళలు అన్నింటా రాణిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులకు మించి తమ శక్తి, యుక్తులను చాటుతున్నారు. ఇంటా.. బయటా అన్నింటా తనదైన ముద్రవేసుకుంటూ తనకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన రంగాల్లోనూ నేడు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో సరిసమానంగా పోటీపడుతున్నారు. చదువుకున్న యువతులు ఎక్కువగా ఈ రంగంపై మక్కువ చూపుతున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు.. క్లరికల్ పోస్టు నుంచి కలెక్టర్ వరకు తమ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చూస్తే పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల స్థానాల్లో 40శాతానికిపైగా మహిళలున్నారు.
జనరల్ స్థానాల్లోనూ ఎంతో మంది తమ సత్తా చాటారు. అంతేకాదు, మరెంతో మంది తమ పదవులకు వన్నె తెచ్చారు. ఒకప్పుడు పదవి ఉన్నా భర్త చాటు భార్యగా కొనసాగినా.. ఇప్పుడు మాత్రం స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక పరిపాలనా రంగానికి వస్తే.. ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది అధికారులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లుగా మహిళలే కొనసాగుతున్నారు. వారు అద్భుతమైన పనితీరు చూపుతున్నారు. వీరితోపాటు పెద్దపల్లి సీపీ రెమా రాజేశ్వరి, కరీంనగర్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జగిత్యాల అదనపు కలెక్టర్ లతశ్రీ ఇలా ఎందరో తమ విధుల్లో సత్తా చాటుతున్నారు. మొత్తంగా నాలుగు జిల్లాల్లో 30వేల పైచిలుకు ఉద్యోగులుంటే, అందులో 13వేల పైచిలుకు మహిళా ఉద్యోగులే ఉన్నారు. వీరంతా తమ విధుల్లో ఉత్తమ పనితీరు చూపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో మహిళలే కీలకం
ఉమ్మడి జిల్లా పరిధిలోకి 13 అసెంబ్లీ నియోజకవర్గాలు రానుండగా, ఇటీవల విడుదల గణాంకాల ప్రకారం మొత్తం 29,73,045 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 14,66,754 ఉంటే మహిళలు 15,06.189 మంది ఉన్నారు. దాదాపు 39 వేల పైచిలుకు మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పూర్వ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అందుకే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మహిళా ఓటర్లే అధిక ప్రభావం చూపనున్నారు.
అంచలంచెలుగా.. ఐఏఎస్‌గా
సమాజంలో పురుషులకంటే మహిళలకే ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అతివల సొంతం అంటున్నారు జల్ద అరుణశ్రీ. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె, అసాధారణ ఫలితాన్ని సాధించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసం చేసిన ఆమె, ఎవరూ ఊహించని విధంగా తొలి ప్రయత్నంలోనే గ్రూప్ 1 సాధించి ఆర్డీవోగా తన ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇటీవలే ఐఏఎస్ హోదాను సాధించారు. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన జల్ద లక్ష్మి, రామస్వామి దంపతుల రెండో కూతురు అరుణశ్రీ. మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియెట్ దాకా కొడిమ్యాల కొడిమ్యాలలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివారు. జగిత్యాల మహిళా డిగ్రీ కాలేజీలో బీకామ్ డిగ్రీ పొందారు. అనంతరం కేయూలో ఎంకామ్ చేశారు. బీఎడ్ కోర్సు చేసిన అనంతరం 2008 డీఎస్సీలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. కొద్దిరోజులు మల్యాల మండలం కొండగట్టు ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అక్కడ పనిచేస్తూనే గ్రూప్-2కు ప్రిపేర్ అయ్యారు.
2010లో గ్రూప్-2లో మంచి ర్యాంకును కైవసం చేసుకున్న అరుణశ్రీ వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఎంపికయ్యారు. కరీంనగర్లో పనిచేస్తున్న సమయంలోనే గ్రూప్-1 (2011 సంవత్సరం) నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రూప్-1కు ప్రిపేర్ అయ్యారు. అందులో మంచి ర్యాంకు సాధించిన అరుణశ్రీ ఆర్డీవోగా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం నిర్మల్ ఆర్డీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. తదుపరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీడీ డీఆర్డీవోగా బదిలీ అయ్యారు. కరీంనగర్లో డీఆర్‌డీఏగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే జిల్లాల పునర్విభజన కావడంతో, సొంత జిల్లా అయిన జగిత్యాల డీఆర్డీవోగా బదిలీ అయ్యారు. 2016 నుంచి దాదాపు ఆరేళ్లు ఇక్కడే వివిధ హోదాల్లో పనిచేశారు.
డీఆర్డీవో నుంచి జిల్లా రెవెన్యూ అధికారిగా పదోన్నతి పొంది జగిత్యాలలోనే పనిచేశారు. తర్వాత అదనపు కలెక్టర్‌గా పదోన్నతి పొందిన అరుణశ్రీ జగిత్యాల అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్‌గా పనిచేశారు. ఇటీవలే ఏఎస్ఎస్ హోదాను సాధించారు. ఈ సందర్బంగా అరుణశ్రీ మాట్లాడుతూ, మహిళలకు ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని చెప్పారు. పెద్దక్క రాజమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా, చిన్నక్క జ్యోతి బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నదని చెప్పారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి తాము వచ్చినా, ఎలాంటి హద్దులు పెట్టకుండా మంచిగా చదువుకోవాలని తమ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాము ముగ్గురం మంచి స్థాయికి చేరుకున్నామన్నారు. కొన్నాళ్లుగా కాలం మారిందని, ప్రస్తుతం ఉన్న మహిళా శక్తి తిరుగులేని శక్తిగా ముందుకు వెళ్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
వంటల యాదమ్మ
కమాన్‌చౌరస్తా, మార్చి 7 : ఆమె ఒక నిరుపేద కుంటుంబానికి చెందిన మహిళ. వంటల తయారీలో విభిన్న రుచులను అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటకు చెందిన యాదమ్మ. జిల్లా కేంద్రంలోని పలువురు వీఐపీల నివాసాల్లో జరిగే శుభకార్యాల్లో వంటలు చేసే ఆమె, ఇటీవల రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీకి సైతం తన చేతి రుచి చూపెట్టింది. యాదమ్మది హుస్నాబాద్ మండలం గౌరవెల్లి కాగా, చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. కానీ, విధి భర్తను దూరం చేసింది. ఈ క్రమంలో కరీంనగర్ చేరుకున్న ఆమె, మొదట కూలీ పని చేసింది. తర్వాత ఒక పాఠశాలలో ఆయాగా చేరి వంట చేసింది. అక్కడి టీచర్లు ‘నీ వంట బాగుంది’ అని ప్రోత్సహించడంతో దగ్గరి వాళ్ల ఫంక్షన్లకు విందు భోజనాలు చేయడం మొదలు పెట్టింది. అనతికాలంలోనే ఈమె చేతి రుచులకు డిమాండ్ వచ్చింది. వీఐపీల శుభాకార్యాలు అంటే యాదమ్మతోనే వంట చేయించాలనేంత క్రేజ్ తెచుకొని రుచులు పండిస్తున్నది.
పెద్దపల్లి, మార్చి 7(నమస్తే తెలంగాణ): ముత్తారం మండలం హరిపురానికి చెందిన యువతి బోడ శ్రీవనితామైథిలీ ప్రకృతి సేద్యంలో రాణిస్తున్నారు. నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడితేనే ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంటూ ‘పాలేకర్’ విధానంలో సేద్యం చేస్తున్నారు. డిగ్రీ దాకా అభ్యసించిన ఆమె, తల్లి తండ్రులు బోడ పుష్పలత, తిరుపతిరెడ్డితో కలిసి తమ ఐదెకరాలను ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఐదు దేశీ ఆవుల్ని పెంచుతూ వాటి మూత్రం, పేడలనే ఎరువుగా వాడుతున్నారు.
వరిలో ఎర్ర, నల్ల, సెంటెడ్ కాలావతి, కృష్ణా బ్లాక్, రెడ్ రైస్‌లో నవారా, రక్తశాలి రకాలు, సెంటెడ్ రైస్‌లో మహారాజ సుగంధ రైస్, చిట్టి ముత్యాలు మహరాజ సెంటెడ్, సాధారణంగా తినే రకమైన కుజీపటాలియా, రత్నఛోడీ, రక్తశాలి, అరటి, పసుపు పంటలను సాగు చేసి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. సాగులోనే కాదు, సామాజిక మాధ్యమాల సాయంతో పంట ఉత్పత్తుల్ని ఇంటి నుంచే అమ్ముకుంటూ మారెటింగ్ లోనూ తనదైన ప్రత్యేకత చూపుతున్నారు. ఫార్మా కల్చర్ కోర్సును పూర్తి చేసి, అమ్మానాన్న, అన్న, చెల్లి సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాని శ్రీవనిత మైథిలీ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘పుడమి పుత్ర’, కేంద్రం నుంచి ‘రైతు నేస్తం’అవార్డులు అందుకున్నానని చెప్పారు.
స్వశక్తితో.. చిలుకూరు బాలాజీ ఫిలిగ్రీ
అతిథులు వచ్చిన సమయంలో ఫిలిగ్రీ బహుమతులు అందించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంతకు ముందు వీటి తయారీ ఆర్డర్లను పేరున్న సంస్థలకు మాత్రమే ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా స్వశక్తితో ముందుకు వస్తున్న మహిళా సంఘాలకు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ముందుకు వచ్చింది చిలుకూరు బాలాజీ ఫిలిగ్రీ సంస్థ నిర్వాహకురాలు కూరోజు సరళ. తాను పుట్టింది మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్. వివాహమైన తర్వాత తన భర్త రాజేశ్వరాచారి తయారు చేసే ఆభరణాలతో మెళకువలు నేర్చుకుంది. బాలాజీ ఫిలిగ్రీ పేరిట షాప్‌ను ప్రారంభించి, ఫిలిగ్రీ వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న డీసీవో శ్రీవాణి సరళను ప్రోత్సహించింది. జిల్లా కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమాల సందర్భంగా అతిథులకు ఇచ్చేందుకు అవసరమైన ఫిలిగ్రీ ఆర్డర్లను సరళకు ఇస్తుండగా, అనతికాలంలోనే ఫేమస్ అయింది. ఇప్పుడు వీరికి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. ఆన్లైన్ సేల్స్ కూడా జరుగుతున్నాయి.
వ్యవసాయ కూలీ నుంచి యూట్యూబ్ స్టార్‌గా
మల్యాల, మార్చి 7 : వ్యవసాయ కూలీ నుంచి సెలబ్రిటీగా ఎదిగింది మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ అలియాస్ మై విలేజ్ షో గంగవ్వ. యూట్యూబ్ స్టార్‌గానే కాకుండా వెండితెరపై మెరుస్తూ.. వయసుతో సంబంధం లేకుండా తపన ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించింది. ‘మై విలేజ్ షో’ వేదికగా తన ఇంటి పక్కనే ఉండే శ్రీరాం శ్రీకాంత్ సాయంతో పలు షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తూ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది. జగిత్యాల మండలం పొలాసలో పుట్టిన గంగవ్వ, ఊహ తెలియని వయసులోనే తన తండ్రిని, కొంత కాలంలోనే తల్లిని కూడా కోల్పోయింది. తినడానికి తిండి లేక సాదే దిక్కు లేక ఇద్దరు తమ్ముళ్లతో ఉన్న గంగవ్వను ఓ మహిళ చేరదీసి కన్నతల్లిలా సాకింది.
ఐదేళ్లు వచ్చేసరికి మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. తన అత్తే గంగవ్వను సొంత తల్లిలా చూసుకున్నది. పెరిగిన తర్వాత అత్తతోపాటు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగించింది. భర్త తాగుబోతు అయినా ముగ్గురు పిల్లలకు పెండ్లి చేసింది. ఈ క్రమంలోనే తన ఇంటి పక్కనే ఉన్న శ్రీరాం శ్రీకాంత్ మై విలేజ్ షో చానల్ కోసం తీసే షార్ట్ఫిల్మ్లలో నటించడం ప్రారంభించింది. దాంతో గంగవ్వ యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. మరోవైపు సినిమాల్లోనూ నటించి సెలబ్రిటీగా మారింది. 60 ఏళ్ల వయసులోనూ బిగ్‌బాస్ 4లో స్పెషల్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి యువతీయువకులతో కలిసి ఆడి పాడింది. ఈ యేడాది శివరాత్రి రోజున ఈషా ఫౌండేషన్ జాగరణ కార్యక్రమానికి హాజరైందంటే ఎంత గుర్తింపు వచ్చిందో చెప్పనవసరం లేదు.
అమ్మకు భరోసా చైతన్య సుధ
గర్భిణుల పాలిట దేవతలా నిలుస్తున్నది ఈ వైద్యురాలు చైతన్య సుధ. పురుడు పోసి మాతృత్వపు మధురిమలను అందించే మహోన్నత బాధ్యతలను పదేండ్లుగా నిర్విరామంగా నిర్వర్తిస్తూనే ఉన్నది ఈ డాక్టరమ్మ. ప్రభుత్వ దవాఖానల్లో సేవలందిస్తూ, ఏటా వేలాది మందికి పురుడు పోస్తున్న ఆమె, కాబోయే వైద్యులకు ఆదర్శం. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుధా చైతన్య, ఇంటర్ వరకు జగిత్యాలలోనే చదివారు. విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు అభ్యసించారు.
అనంతరం ధర్మపురి ప్రభుత్వ దవాఖానలో వైద్యురాలిగా 2008లో విధుల్లో చేరారు. తదుపరి హైదరాబాద్‌లోని నీలోఫర్ వైద్యశాలలో పీజీ కోర్సును పూర్తి చేశారు. 2013లో రాయికల్ దవాఖానలో ప్రభుత్వ వైద్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అక్కడ ప్రసవాల సంఖ్య పెరిగింది. కొద్ది నెలల్లోనే రాయికల్ మండల ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లడం తగ్గిపోయింది. నమ్మకంగా ప్రసవాలు చేయడం, తప్పనిపరిస్థితుల్లో సిజేరియన్లు సైతం ప్రభుత్వ దవాఖానలోనే చేస్తుండడంతో రాయికల్ ప్రభుత్వ దవాఖాన ఉమ్మడి జిల్లాలోనే ప్రసవాల కేంద్రంగా మారిపోయింది. ఏటా 1500 నుంచి 1800 ప్రసవాలు నమోదు కావడం గమనార్హం. రాయికల్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఆమె, జగిత్యాల ఏరియా దవాఖానలోనూ ప్రసవాలు చేయడంతో మంచి గుర్తింపు లభించింది.
మెట్‌పల్లికి బదిలీపై వెళ్లినా.. అక్కడ కూడా ఉన్నతమైన వైద్య సేవలు అందించారు. ఆమె ఉన్న సమయంలో ఏటా 2వేలకు పైగా ప్రసవాలు నమోదయ్యాయి. మెటర్నిటీ లీవ్ తీసుకున్న సుధా చైతన్య, గత జనవరిలో సిరిసిల్ల ప్రధాన దవాఖానలో గైనకాలజిస్ట్‌గా విధుల్లో చేరారు. కాగా ప్రస్తుతం వేములవాడకు డిప్యూటేషన్‌పై పంపించగా, ప్రస్తుతం అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. పేద, దిగువమధ్యతరగతి కుటుంబ సభ్యులు ప్రభుత్వ దవాఖానలకు ప్రసవాలకు వస్తారని, వారికి సేవ చేయడం తన బాధ్యతని డాక్టర్ సుధా చైతన్య చెప్పారు. తల్లీబిడ్డ క్షేమంగా దవాఖాన నుంచి వెళ్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల కండ్లలో కనిపించే ఆనందం, వారు చూపే వినమ్రత వెలకట్టలేమని, అంతకు మించిన సంతోషం లేదంటున్నారు.
భూదేవి సహనం.. అరుణ సొంతం
36 ఏండ్లుగా కొడుకును కాపాడుకుంటున్న తల్లి
భూదేవి అంత సహనం మగువ సొంతం అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం పాలోజు అరుణ. ముప్పై ఆరేండ్ల క్రితం వైకల్యంతో పుట్టిన కొడుకును ఇప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. వయసుతోపాటు కొడుకు ఎదుగుదల లేదన్న రంది బాధిస్తున్నా, తన వయసు పెరుగుతూ ఆరోగ్యం ఇబ్బందిపెడుతున్నా, ఇప్పటికీ అదే దీక్షతో కొడుక్కు సేవలందిస్తున్న ఆ మాతృమూర్తి. మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన పాలోజు అరుణ, సత్తయ్య దంపతులు కూలీలు. రోజువారీగా పనిచేస్తేనే కుటుంబం గడిచేది. వీరికి 1987లో మొదటి సంతానంగా కవలలు జన్మించారు. నెలలు నిండకుండా, సరైన బరువు లేకుండా, అనారోగ్యంతో పుట్టారు. అందులో జన్మించిన కొద్దిసేపటికే ఒకరు మృతి చెందగా, మరొకరు బతికారు. అయితే బతికిన శిశువు ఎదుగుదల లేకుండా ఉండడంతో ఆ దంపతులు దవాఖానకు తీసుకెళ్లారు.
శిశువు పూర్తిగా అనారోగ్యంతో ఉన్నదని, జన్యు లోపం కారణంగా బాబు అంగవైకల్యంతోపాటు మంద బుద్ధితో ఉంటాడని వైద్యులు చెప్పడంతో ఆందోళన చెందారు. అయినా బిడ్డపై ఉన్న ప్రేమను వదులుకోలేదు. దేవుడు ఎప్పటికైనా కరుణించి తమ కొడుక్కు ఆరోగ్యం ప్రసాదిస్తాడన్న నమ్మకంతో ఆ శిశువుకు రాజశేఖర్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా ఎదుగుదల లేక అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ముప్పై ఆరేళ్లుగా రాజశేఖర్‌ది అదే దీన స్థితి. అయినా ఆ తల్లి అరుణ మాత్రం కొడుకును కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నది. అన్నం తినిపించడం నుంచి మలమూత్రాల శుభ్రం వరకు అన్ని పనులనూ విసుగు, విరామం లేకుండా చేస్తూనే ఉన్నది. మూడున్నర దశాబ్దాలుగా ఆ మాతృమూర్తి చేస్తున్న సేవను చూస్తే ఎవరికైనా కన్నీరు రాక తప్పదు. ‘కన్నకడుపు సార్.. నా బొందిల పానం ఉన్నంత వరకు నా కొడుకును సాదుత. ఆ తర్వాత దేవుని దయ’ అంటూ అరుణ కన్నీరు పెట్టుకున్నది. అరుణను చూస్తే అర్థం అవుతుంది ఆమె తెగువెంతో.. ఆమె మనసెంత వెన్నో!
ఆర్చరీలో రాజేశ్వరి
మొన్నటిదాకా ఆమె ఒక సాధారణ మహిళ. ఓ వైపు ఇంటి బాధ్యతలు, ప్రభుత్వోద్యోగం. నాలుగున్నర పదుల వయసులో అనుకోకుండా కలిగిన ఆసక్తి, ఆమెను అంతర్జాతీయ క్రీడాకారిణిగా మార్చింది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వయసుతో సంబంధం లేకుండా విజయాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు దొంతు రాజేశ్వరి. కరీంనగర్లో నివాసముంటున్న ఆమె వెల్గటూర్ మండల తహసీల్ కార్యాలయంలో ఆర్ఐ. ఆమె భర్త ఆర్టీసీ ఉద్యోగి. వీరికి కొడుకు మాణికేశ్వర్, కూతురు వందన ఉన్నారు. వీరికి ఆర్చరీలో శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టారు ఆ దపంతులు. పిల్లలను స్టేడియానికి తీసుకువెళ్లి, అక్కడే ఉండి శిక్షణ ఇప్పిస్తూ వారిని ప్రోత్సహించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆర్చరీపై కిషన్‌తోపాటు రాజేశ్వరికి ఆసక్తి పెరిగింది. దాంతో ఇంటి వద్ద వెదురు కర్రలతో విల్లును, బాణాలను తయారు చేసి సాధన చేశారు. తర్వాత కోచ్‌ల సహకారంతో పూర్తి స్థాయి విల్లు, బాణాలతో ప్రాక్టీస్ చేసి రాణించారు.
మాస్టర్స్ విభాగంలో (40 ఏండ్లు పైబడిన కేటగిరీ) రాజేశ్వరి రాణించడం మొదలు పెట్టారు. గతేడాది కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నేషనల్ మాస్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరుఫున రాజేశ్వరి జాతీయ స్థాయిలో రజత పతకాన్ని సాధించారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, ఇండియన్ రౌండ్, కంపౌండ్ రౌండ్, బో విభాగాల్లో బంగారు, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో రాజేశ్వరికి దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. వచ్చే మే నెలలో దక్షిణ కోరియాలో నిర్వహించనున్న ఆసియా, పసిఫిక్ అంతర్జాతీయ క్రీడల్లో మాస్టర్ విభాగంలో భారతదేశానికి రాజేశ్వరి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పోటీల కోసం ఆమె శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ, పట్టుదల, ప్రోత్సాహం ఉంటే మహిళలు వయసుతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పారు. కుటుంబ జీవితం నుంచి క్రీడాకారిణిగా మారిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని, ఆటపై ఉన్న మక్కువ, ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతున్నానని ధీమా వ్యక్తం చేశారు.
– జగిత్యాల, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
ఆర్డీవో నుంచి కలెక్టర్‌గా
సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన ఆయేషా మస్రత్ ఖానమ్
మహిళలు సమాజంలో తమ హక్కులను సాధించుకొని, ఆత్మగౌరవ జీవితాన్ని కొనసాగించాలంటే విద్యనే ప్రధాన మార్గమంటున్నారు ఐఏఎస్ అధికారి, పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రెటరీ ఆయేషా మస్రత్‌ఖానమ్. ఆమెది ధర్మపురి మండలం రాయపట్నానికి చెందిన సాధారణ కుటుంబం. తల్లిదండ్రులది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో మొదటి నుంచీ ఆమెను చదువుల్లో ప్రోత్సహించారు. ప్రాథమిక విద్యతోపాటు డిగ్రీ వరకు కాగజ్‌నగర్‌లోనే చదివిన ఆయేషా మస్రత్‌ఖానమ్, తదుపరి మాస్టర్ డిగ్రీని నాగ్‌పూర్‌లో పూర్తి చేశారు. అక్కడే ఎంబీఏ పూర్తి చేసి అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2008లో గ్రూప్-1లో ఎంపీడీవోగా ఎంపికయ్యారు. కొన్నాళ్లు బాధ్యతలు నిర్వహించారు. సారంగాపూర్ ఎంపీడీవోగా పనిచేశారు.
2010లో మరోసారి నిర్వహించిన గ్రూప్-1లో ర్యాం క్ సాధించిన ఆయేషా మస్రత్ ఖానమ్ ఆర్డీవోగా ఎంపికయ్యారు. ఏ టూరు నాగారం ఐటీడీఏ అధికారిగా, తర్వాత మంథని, మంచిర్యాల ఆర్డీవోగా పనిచేశారు. గద్వాలలో జూరాల ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వర్తించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వికారాబాద్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పంచాయతీరా జ్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. విద్యతోనే వికాసం సాధ్యమని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలం టే విద్యనే ప్రధాన సాధనమని ఆయే షా మస్రత్ ఖానమ్ చెప్పారు. ఇప్పుడిప్పుడే మహిళలు విద్యారంగంలో రాణిస్తున్నారని, రెండు దశాబ్దాలుగా భారత సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రం గాల్లో ప్రోత్సహిస్తున్నదని, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చే యడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలని వినియోగించుకొని ముందడుగు వేయాలని సూచించారు.
ఉపాధినిస్తూ.. అండగా నిలుస్తూ..
భర్త అనుకోని ప్రమాదంలో మంచం పట్టగా, ఆటవిడుపుగా నేర్చుకున్న కుట్టు శిక్షణను స్వయం ఉపాధిగా మల్చుకొని జీవితాన్ని నిలబెట్టుకున్నారు కరీంనగర్‌కు చెందిన ఉస్మాన్ భాను. పిల్లలను ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదివిస్తూ, 15 ఏండ్లుగా మంచంలోనే ఉన్న భర్త సేవ చేస్తూ ముందుకు సాగింది. మొదట సిరిసిల్ల నుంచి క్లాత్‌లు తీసుకువచ్చి వస్ర్తాలు తయారు చేస్తూ ఉపాధి పొందింది. తనలాంటి మహిళలకు వృత్తిని నేర్పిస్తూ, వారికి ఉపాధి మార్గాలు చూపుతున్నది. 2008లో మహిళా సంఘం ద్వారా రుణం తీసుకొని ఆర్థికంగా నిలదొక్కుకున్నది. సొంతంగా ఒక బొటిక్‌ను ప్రారంభించింది. ఇద్దరు పిల్లలను ఉన్నతంగా చదివించిన ఆమె, టైలరింగ్ వృత్తిలో రాణిస్తూ మరో పది మంది నిరుపేదలకు ఉపాధిచూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నది.
– కమాన్‌చౌరస్తా, మార్చి 7