Surgery | పెద్దపల్లి, మే 21(నమస్తే తెలంగాణ): క్లిష్టమైన శస్త్ర చికిత్సలను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్య బృందాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ అభినందించారు. గత నాలుగు సంవత్సరాలుగా గర్భ సంచిలో గడ్డ తో ఇబ్బంది పడుతున్న మైనారిటీ మహిళ రక్తహినత, ఫిట్స్‌తో బాధపడుతోంది.
కాగా పలు సమస్యలతో బాధితురాలు ఇబ్బందులు పడుతున్నా వైద్యులు అనసూయ, శ్రీధర్ శౌరయ్య నేతృత్వంలో శస్ర్త చికిత్స చేసినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. ఇలాంటి శస్త్ర చికిత్సలు పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్ లో నిర్వహిస్తున్నామని, అవసరం ఉన్న ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు వివిధ రకాల స్పెషలిస్ట్ సేవలు, శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని, అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కొండా శ్రీధర్ కోరారు.