collected blood samples | వీణవంక, ఆగస్టు 18: వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో జాండీస్ (పచ్చకామెర్లు) వ్యాధి వ్యాప్తి చెందడంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణతో పాటు పలువురు అధికారులు గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ వైరల్ ఫీవర్, జండీస్ వచ్చిన వారితో అధికారులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వీణవంక పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి రోగులు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. గ్రామంలోని వాటర్ ప్లాంట్లను పరిశీలించారు.
వరంగల్ రీజినల్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీ అధికారి డాక్టర్ కృష్ణారావు గ్రామంలోని వాటర్ ప్లాంట్లతో పాటు మిషన్ భగీరథ మంచినీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కలుషితమైన నీటిని తాగకుండా వేడివేడి ఆహారం తీసుకోవడంతో పాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. జాండీస్ వచ్చిన వారు నూను పదార్థాలు కాకుండా తొందరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, వైద్యులు ఇచ్చిన మందులను వారం రోజులు వేసుకోవాలని సూచించారు.
మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వారం రోజుల పాటు గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, వీణవంక పీహెచ్సీ డాక్టర్ వరుణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.