ప్రైవేట్ వైద్య రంగంలో మెడికల్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి.. అడిగే వారు లేరని రోగులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నాయి.. స్కీంలు, వన్ ప్లస్ వన్ ఆఫర్లతో కొందరు వైద్యులను ప్రలోభాలకు గురి చేస్తూ ఫార్మా కంపెనీలు, వాటి ఏజెన్సీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. తమ కంపెనీ మందులను రోగులతో వాడిపిస్తే లక్షల్లో ఇన్సెంటివ్‌లు అందిస్తున్నాయి. ఖరీదైన కార్లు కొనిస్తున్నాయి. విదేశీ టూర్లు, కాన్ఫరెన్స్ ట్రిప్పులతో ఆకర్షిస్తున్నాయి. తాము చెప్పిన మందులనే వైద్యులతో రాయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. సేవా నిరతిని మరిచిన కొందరు వైద్యులు, సదరు కంపెనీలు, ఏజెన్సీల మాయలో పడిపోతున్నారు. తామిచ్చే మందులు రోగులకు ఆరోగ్యాన్ని ఇస్తాయా.. లేదా..? అనేది చూడకుండా ఇన్సెంటివ్లకే మొగ్గు చూపుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కరీంనగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడిసిన్ వ్యాపారం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఎక్కడ చూసినా మెడికల్ షాపులు, ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండగా, అక్రమ దందాకు తెరలేస్తున్నది. ఈ రకంగా నడిచేది ఒకటైతే.. ఫార్మా కంపెనీల యజమానులు, వాటి తాలుకా ఏజెన్సీలు ఏకంగా కొందరు వైద్యులను మచ్చిక చేసుకొని వ్యాపారం పెంచుకుంటున్నారు. పది రూపాయల విలువైన మందు బిల్లలను 100కు అమ్ముకుంటూ రోగులపై భారం మోపుతున్నారు.
చిన్న జ్వరం వచ్చి ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే చాలు పరీక్షల పేర డయాగ్నోస్టిక్ సెంటర్లు దండుకుంటుండగా, నాసిరకం, సబ్‌స్ట్యూట్ మందులు రాస్తూ కొందరు వైద్యులు ఫార్మా కంపెనీలకు దోచి పెడుతున్నారు. చిన్న జ్వరానికే అవసరం లేని ఐదారు రకాల మందులు, అవి కూడా ఫలానా కంపెనీవే వాడాలని సదరు కంపెనీల పేర్లతో ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. నిజానికి ప్రిస్క్రిప్షన్పై మందు స్వభావాన్ని తెలిపే మాలిక్యూల్ మాత్రమే రాయాల్సి ఉన్నా పట్టించుకోకుండా తమకు ఇన్సెంటివ్‌లు ఇచ్చే కంపెనీల పేర్లు బాహాటంగానే రాస్తున్నారు. కంపెనీల పేర్లు రాయడం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా తమనెవరు అడిగే వారని విచ్చలవిడి తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
వైద్యుల పంట పండిస్తున్న ఆఫర్లు
నాసిరకం, సబ్‌స్ట్యూట్ మందులు తయారు చేస్తున్న కొన్ని ఫార్మా కంపెనీలు వాటిని అమ్ముకునేందుకు డాక్టర్లనే ముందు పెడుతున్నట్టు తెలుస్తున్నది. వైద్యులు కనిపించే దేవుళ్లుగా నమ్ముతున్న రోగులు.. డాక్టర్లు రాసిన మందులనే వాడాలని చూస్తారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న ఫార్మా కంపెనీలు, వాటి ఏజెన్సీల నిర్వాహకులు సబ్‌స్ట్యూట్ మందులను రాయిస్తున్నారు. వీటిని రాసిన వైద్యులకు స్కీంలు, వన్ ప్లస్ వన్ పేరిట ఆఫర్ల ఆశ చూపుతున్నారు. ఇది ఇప్పుడు పెద్ద దందాగా మారిపోయింది.
బ్రాండెడ్ కంపెనీలు కూడా డాక్టర్ల వద్ద క్యూ కడుతున్నాయి. ఆఫర్లు ఇస్తే తప్పా కొందరు వైద్యులు ఆ కంపెనీల మందులు రాసే పరిస్థితిలో లేరు. ఎంత ఎక్కువ మందులు రాస్తే అంత ఇన్సెంటివ్స్ అందుతుండడంతో సేవా భావం మరిచి, కంపెనీలు, ఏజెన్సీల చేతిలో కీలు బొమ్మలుగా మారిపోతున్నారు. కొన్ని కంపెనీలు లక్ష విలువైన మందులు రోగులకు రాస్తే 10వేల నుంచి 20వేల వరకు ఇన్సెంటివ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్రాండెడ్ కంపెనీలైతే నెలనెలకు లెక్కలు వేసి లక్షల్లో ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. వీటితోపాటు ఖరీదైన కార్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి. విదేశీ టూర్లు, విహార యాత్రలే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడ వైద్య పరమైన కాన్ఫరెన్స్‌లు జరిగినా ఆయా కంపెనీలే పూర్తి ఖర్చులు భరించి చాలా మంది వైద్యులను పంపిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఎవరి వాటా వాళ్లకే..
ప్రైవేట్ వైద్యరంగంలో మెడిసిన్ దందా చాలా లోతుగా పాతుకు పోయింది. వైద్యులు మొదలు మెడికల్ షాపుల వరకు ఆఫర్లు, స్కీంలు మీదనే ఈ వ్యాపారం నడుస్తున్నది. చిన్న చిన్న ఫార్మా కంపెనీలే ఈ రకమైన మెడిసిన్ దందాకు తెరలేపినట్లు తెలుస్తున్నది. వీటి దాటికి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు సైతం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఉన్నది. నాసిరకం, సబ్‌స్ట్యూట్ మందులు తయారు చేస్తు న్న చిన్న చిన్న కంపెనీలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు వైద్యులు, మెడికల్ షాపుల నిర్వాహకులను పావులుగా వాడుకుంటున్నాయి. ఎవరి వాటాలు వారికి అందించడమే కాకుండా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
10తో తయారైన మందులకు కొన్ని కంపెనీలు 100 నుంచి 300 వరకు ఎంఆర్పీ ధరలు ముద్రిస్తున్నాయి. అందులో ఎవరి వాటా వారికి వచ్చేలా ఆయా కంపెనీల ప్రలోభాలు ఉంటున్నాయి. ఉదాహరణకు 100 విలువైన ఒక ట్యాబ్లెట్‌పై స్టాకిస్టుకు 70, మెడికల్ షాపులకు 80 వరకు బ్రాండెడ్ కంపెనీలే ఆఫర్లు ఇస్తుంటాయి. ఇక అన్ బ్రాండెడ్ మందులైతే నగానికి సగం, వన్ ప్లస్ వన్ స్కీంలు వంటివి ఆఫర్లు ఇచ్చి తమ మందు లు కట్టబెడుతున్నాయి. వీటిని రోగులకు బ్రాండె డ్ ధరకు విక్రయిస్తూ మెడికల్ షాపులు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ్రఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్న సంబంధిత డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఏమాత్రం పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీలు మొదలుకొని, ఏజెన్సీలు, మెడికల్ షాపుల నుంచి అధికారులకు సైతం మామూళ్లు అందుతాయనే విమర్శలున్నాయి.