“జంపన్న వాగుల్లో అబియా.. జాలారు బండల్లా అబియా..
నా తల్లి సమ్మవ్వా అబియా.. నీకు పదివేల దండాలే అబియా..”
..ఇలా అబియ రాగాలు, శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లు, భక్తుల జేజేల నడుమ సమ్మక్క తల్లి గురువారం సాయంత్రం గద్దెనెక్కింది! ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జరుగుతున్న జాతరలో బిడ్డ సారలమ్మతో కలిసి కొలువుదీరగా, ఒక్కసారిగా జనప్రవాహం పోటెత్తింది. రెండేళ్లుగా ఎదురు చూసిన భక్తులకు కన్నుల పండువగా తల్లి దర్శనమిచ్చింది. ఒడిబియ్యంతో తరలివచ్చిన మహిళలు, ఇద్దరమ్మలకు కుంకుమ, పసుపు, బంగారం(బెల్లం) సమర్పించి, పిల్లాపాపను, గొడ్డూ గోదను చల్లంగ చూడాలని వేడుకున్నారు. కాగా, గద్దెలపైకి చేరిన వనదేవతలిద్దరినీ దర్శించుకునేందుకు నేడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
– కమాన్‌చౌరస్తా/ శంకరపట్నం/ హుజూరాబాద్‌టౌన్/ వీణవంక, ఫిబ్రవరి 22
సమ్మక్క తల్లి గురువారం గద్దెలపైకి చేరుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ముఖ్య జాతరలకు భక్త జనం పోటెత్తింది. సమ్మక్క, సారలమ్మ గద్దెలకు చేరుకోవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి, వీణవంక, చల్లూరు, కేశవపట్నం, రంగనాయకులగుట్ట, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, గంగాధర, తిమ్మాపూర్, మానకొండూర్, కరీంనగర్‌రూరల్ మండలాల్లోని పలు గ్రామాలు, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, జనగామ, గోలివాడ, ఓదెల మండలం కొలనూర్, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, గర్రెపల్లితోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లోని పలు గ్రామాలు, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాలు, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం, గొల్లపల్లి మండలం చిల్వకోడూరు, పెగడపల్లి మండలకేంద్రం, ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో జరిగిన జాతరలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆయా చోట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్, విజయరమణారావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన స్వగ్రామమైన వీణవంకలో ఎత్తు బంగారం ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు.