Godavarikhani | కోల్ సిటీ, మార్చి 28 : రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి మండుటెండలో కదలకుండా కూర్చొని మరమ్మతు పనులు పూర్తి చేయించిన సంఘటన శనివారం గోదావరిఖనిలో ప్రాధాన్యత చోటు చేసుకుంది. స్థానిక శారదానగర్ పీజీ కళాశాల ఎదుట డిస్ట్రిబ్యూషన్ పైపులైను వద్ద లీకేజీలకు సిబ్బంది మరమ్మతు పనులు చేస్తుండగా, అటుగా వచ్చిన మేయర్ స్వామి గమనించి ఆరా తీశారు. లీకేజీ కారణంగా ప్రశాంత్ నగర్ నుంచి పవర్ హౌస్ కాలనీ వరకు దాదాపు నాలుగు డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలుసుకొని చలించారు.
ఎండాకాలంలో నీటి సమస్య రావొద్దని చెప్పినా నిర్లక్ష్యం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. తర్వాత వెళ్లిపోకుండా అక్కడే కల్వర్టుపై కూర్చొని లీకేజీ మరమ్మతు పనులు పూర్తయ్యేదాకా ఉండిపోయారు. దీనితో సిబ్బంది శరవేగంగా పనులను పూర్తి చేశారు. మేయర్ మాట్లాడుతూ రేపటి నుంచి ఆ డివిజన్ లకు నీటి సరఫరా యథాతథంగా కొనసాగాలని సూచించారు. లీకేజీలు ఎక్కడ జరిగినా సెల్ నం.9392483959కు సమాచారం లేదా ఫొటో తీసి లొకేషన్ వాట్సాప్ చేయాలని కోరారు. మున్సిపల్ సేవల్లో ఏమైనా లోపాలు ఉంటే ఆ నంబర్ లో తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపారు.