Ramagundam | కోల్ సిటీ, మార్చి 12: గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డు పునరుద్ధరణకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. గత మూడు నెలల కిందట యూజీడీ పనుల్లో భాగంగా పైపులైను కోసం తవ్విన మట్టిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రోడ్డుపైనే కుప్పలుగా వదిలేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆ మట్టి దిబ్బలకు రోడ్డంతా ఆనవాళ్లు కోల్పోయింది. దీంతో మార్కెట్ కు వచ్చే వినియోగదారులు వరుస ప్రమాదాలకు గురి కావల్సి వస్తోంది. ఇటీవల ‘అద్వాన్నంగా మార్కెట్ రోడ్డు’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
ఈమేరకు నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి స్పందించి వెంటనే మార్కెట్ రోడ్డు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో గురువారం నగర పాలక సిబ్బంది జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మార్కెట్ రోడ్డుపై పేరుకుపోయిన మట్టి దిబ్బలను తొలగించారు. దీంతో రోడ్డు యథాస్థితికి చేరుకోవడంతో నమస్తే తెలంగాణ కథనానికి పలువురు హర్షం వ్యక్తం చేశారు. కాగా, మార్కెట్ రోడ్డు ప్రక్కన ఆక్రమణలు తొలగించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. అలాగే త్వరితగతిన నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.