Siricilla | సిరిసిల్ల టౌన్, జూలై 30 : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ భారీ వృక్షం నేల కూలింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామానికి చెందిన అరుకుటి రాజు అనే వ్యక్తి తన మినీ వ్యానులో సిరిసిల్లలోని కలెక్టరేట్‌కు వెళ్తున్నాడు. స్థానిక గాంధీ చౌరస్తా నుండి పెద్ద బజారు మీదుగా వెళ్తున్న సమయంలో హనుమాన్ ఆలయం వద్దకు చేరుకుగానే భారీ వేపచెట్టు ఒకసారిగా నేలకొరిగింది. చెట్టు రాజు వెళ్తున్న వ్యాన్‌పై పడడంతో అతడి తలకు గాయాలు అయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు రాజును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక కౌన్సిలర్ అటుచెర్ల సాయి కృష్ణ అధికారులకు సమాచారమందించి రోడ్డుపై కూలిన చెట్టును తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇదే ప్రాంతంలోని హనుమాన్ ఆలయం, విమల్ థియేటర్ సమీపంలో ఉన్న భారీ వృక్షాలను తొలగించాలని అధికారులకు సూచించారు. పెద్ద బజార్ రోడ్డులో నేలకూలిన చెట్లు తొలగించాలని, గతంలోని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.