హైదరాబాద్, అక్టోబర్ 05: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హైదరాబాద్‌లో సందడి చేశారు. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘7పాడెల్ ఎంఎస్ ధోనీ’ పాడెల్, ఫిట్నెస్, వెల్నెస్ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారీ దిగ్గజం. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిగా ఇండోర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మూడు పాడెల్ కోర్టులు, జిమ్, రికవరీ సూట్, సౌనా, ఐస్ బాత్, ఇన్ఫ్రారెడ్ గది, యోగా, పైలేట్స్ స్టూడియో తదితర సదుపాయాలు ఉన్నాయి.
‘7పాడెల్ ఎంఎస్ ధోనీ’ ఫిట్నెస్, వెల్నెస్ కేంద్రం ప్రారంభం సందర్భంగా ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. ‘‘ఒక క్రీడను అభివృద్ధి చేసేందుకు అడ్డదారులు ఉండవు. మంచి కోర్టులను నిర్మించాలి. ఆడేవారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. క్రీడల్లో రాణించాలి అనుకునే ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలి. అప్పుడే క్షేత్రస్థాయి నుంచి ఆ క్రీడ అభివృద్ధి చెందుతుంది. ఒక్కో నగరానికి విస్తరిస్తూ భారత్‌లో పాడెల్ ఎదుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ కొత్త అధ్యాయం మాత్రమే.. ఇదే చివరిది కాదు’’ అని పేర్కొన్నారు.
పాడెల్పార్క్ ఇండియా సహ వ్యవస్థాపకుడు జిగర్ దోషి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కొంతకాలంగా భావిస్తున్నాం. ఇందుకు ఇప్పుడు సరైన సమయమని నిర్ణయించుకున్నాం. శారీరక వ్యాయామంతో పాటు సామాజిక అనుబంధాన్ని పెంచే క్రీడలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పాడెల్ ఇందుకు అనువైన క్రీడ. శిక్షణ, క్రమం తప్పకుండా ఆటలు, పోటీల నిర్వహణ ద్వారా పాడెల్ కమ్యూనిటీని విస్తరించడమే మా లక్ష్యం’’ అని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘7పాడెల్ ఎంఎస్ ధోనీ’ పాడెల్, ఫిట్నెస్, వెల్నెస్ కేంద్రంలో ఆటగాళ్లు, సందర్శకుల కోసం కెఫే, ప్రత్యేక వీక్షణ గ్యాలరీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. శిక్షణ పొందిన కోచ్‌లతో పాడెల్ శిక్షణతో పాటు స్థానిక స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, దిల్లీలో 7పాడెల్కు 50కి పైగా సొంత, నిర్వహణలోని కోర్టులు ఉన్నాయని సంస్థ తెలిపింది. వీటి ద్వారా 55 వేల మందికి పైగా ఆటగాళ్లు అనుసంధానమయ్యారని పేర్కొంది. తాజాగా హైదరాబాద్‌ను ఈ నెట్‌వర్క్‌లో చేర్చామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కొచ్చి, చెన్నై, జైపూర్, ఢిల్లీ ఎన్సీఆర్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వారు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1.25 లక్షల మందికి పైగా పాడెల్ ఆటగాళ్లు ఉన్నట్లు అంచనా. పాడెల్పార్క్ ఇండియా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 320కి పైగా కోర్టులను నిర్మించగా, 2027 చివరి నాటికి వాటి సంఖ్యను 500కు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో పాడెల్పార్క్ ఇండియా సహ వ్యవస్థాపకులు నిఖిల్ సచ్దేవ్, జిగర్ దోషి, ప్రతీక్ దోషి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.