Suicide | పెద్దపల్లి రూరల్, జనవరి 12 : పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన గుండ ఆలియాస్ పోగుల కావ్య (22) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దవఖానకు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిగారింటి సంబంధీకులు దవఖాన వద్దకు చేరుకుని కావ్య మృతికి అత్తింటివారే కారకులని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు మృతురాలి తరఫు బంధువుల కథనం ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన పొగుల కావ్యను గత రెండు సంవత్సరాల క్రితం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన గుండ శ్రావణ్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో అన్ని లాంచనాలు అప్పగించినా అదనపు కట్నం వేదిస్తున్నారని ఆరోపిస్తు కావ్య భర్త శ్రావణ్ తో పాటు అత్త తదితరులపై మృతురాలి తండ్రి పోగుల రాజమల్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ తెలిపారు.