మంథని, డిసెంబర్ 13: ‘ఈ మట్టిపై ప్రేమ, ప్రజలపై మమకారం ఉన్న వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే ఎలా ఉంటుందో నాలుగున్నరేండ్లలోనే చేసి చూపించా. మంథనిని అన్నిరంగాల్లో తీర్చిదిద్దా. పేదోడి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. చేస్తున్నాం. పేదోడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే అతని పేదరికంపై చర్చించడం సరికాదు. పేదవాళ్లే సంచలనాలు సృష్టిస్తారనే విషయాన్ని ప్రతి ఒకరూ గమనించాలి’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని హమాలీ కార్మికులకు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీషర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో మహనీయులపై చర్చ జరుగాలని పదే పదే చెబుతున్నా ఎవరికీ అర్థం కావడం లేదని వాపోయారు. అంతేకాకుండా అట్టడుగు వర్గాల ఓట్లతో గెలిచి ఈ ప్రాంతానికి ఏం చేశారోననే విషయాలపై చర్చ జరుగడంలేదని, కేవలం బీదోడు ఏం చేస్తున్నారని చర్చిస్తున్నారే తప్ప, ఈ మట్టిలో పుట్టిన వాళ్లకు అధికారం అప్పగిస్తే ఎలా ఉంటుందోనని చర్చించడం లేదన్నారు. ఈ మట్టిపై ప్రేమ, ప్రజలపై మమకారం ఉన్న వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే ఎలా ఉంటుందనడానికి మంథనిలోని హమాలీ సంఘమే నిదర్శనమన్నారు.
అనేక ఏండ్లుగా ఒక సంఘంగా కొనసాగుతుందని, గతంలో సంఘం నుంచి వెళ్లిన కొంతమంది సంఘాన్ని రెండుగా చీల్చే ప్రయత్నాలు చేశారని దుయ్యబట్టారు. ఆనాడు శ్రీపాదరావు స్పీకర్గా ఉన్న సమయంలో తాను హమాలీ కార్మికులకు అండగా నిలిచానని, సంఘం ఒకటిగా ఉండాలని కొట్లాడిన ఘనత తనకే దకుతుందన్నారు. చరిత్రకారుల గురించి మనకు తెలియకుండా చేసిన గత పాలకులు, వారి తండ్రి చరిత్రను తెలుసుకుని మొకుమన్నారే తప్ప ఏనాడూ మహనీయుల గురించి చెప్పలేదని విమర్శించారు. పేద వర్గానికి చెందిన తాను లేకపోతే హమాలీ కార్మికులకు ఈనాడు శాలువాలు కప్పేవారా..? అని ప్రశ్నించారు. మన ఓట్లతో అధికారం కోసం.. రాజకీయం కోసం బతికే ఆ కుటుంబం ఏనాడూ పేదలకు చెంచెడు నీళ్లుపోయలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నామని, రాబోయే రోజుల్లో హమాలీ కాలనీ నిర్మిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హమాలీలు పాల్గొన్నారు.