తిమ్మాపూర్, జనవరి 12 : పండుగ పూట మండలంలోని మన్నెంపల్లిలో గల ఎస్సీ కాలనీకి సంతోషం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున డీ 4 కెనాల్‌కు మళ్లీ గండిపడడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్నది. గతంలోనే మూడుసార్లు గండిపడినా అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడంతో సమస్య మళ్లీ పునరావృతమవుతున్నదని, ఇదేం నిర్లక్ష్యమని ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాలువ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామం మీదుగా సైదాపూర్ వెళ్తుంది. ఇదే క్రమంలో పీచుపల్లి వద్ద డీ4 కాలువ విడిపోయి తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీటిని అందిస్తుంది.
ఈ క్రమంలో మన్నెంపల్లి మీదుగా చంజర్ల తదితర గ్రామాల మీదుగా వెళ్లే ఈ కెనాల్, గ్రామంలోని ఎస్సీ కాలనీ పైన కాలువ కట్ట పరిమాణం తక్కువ మోతాదులో ఉండడం, ఎత్తుగా ఉండడంతో నీళ్లు మర్లపడుతున్నాయి. దీనికి తోడు కాలువలో చెత్తాచెదారం తీయకపోవడంతో నీరు వెళ్లలేక తరచూ గండిపడుతున్నది. ఇప్పటికే మూడు సార్లు తెగిపోగా, ఆదివారం తెల్లవారుజామున మరోసారి గండిపడడంతో మన్నెంపల్లి ఎస్సీ కాలనీ జలమయమైంది. వీధులన్నీ నీటితో నిండిపోయాయి. అయితే కాలువ గండి పడిన సమీపంలో గుట్ట ఉండగా, దాని వరద నీళ్లు బయటకు వెళ్లేందుకు కెనాల్ కింద నుంచి డీబీ ఏర్పాటు చేశారు. గండి నుంచి బయటికి వస్తున్న నీరు ఆ డీబీ గుండా గ్రామంలోకి చేరుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించి, ఘటనపై ఆరా తీశారు. గ్రామాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి, బాధితులతో మాట్లాడారు.
ఆదివారం తెల్లవారే సరికి వరద వచ్చి ఇంటిని ముంచేసింది. ఇది ఒక్కసారి జరగలే. గతంలో ఇలానే జరిగింది. అప్పటిమందం సమస్య పరిష్కరించి వదిలేస్తున్నరు. మళ్లీ పునరావృతం అవుతున్నది. పొద్దుపొద్దున్నే నీళ్లు రావడంతో ఇంట్ల సామాన్లన్నీ తడిచిపోయినయ్. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి మాకు మరోసారి సమస్య లేకుండా చూడాలి.
200 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న డీ4 కాలువకు స్థాయికి మించి రైతులు నీటిని మళ్ల్లించుకున్నారు. దీంతో సామర్థ్యం సరిపోక తెగిపోయింది. గతంలో సైతం అదే ప్రాంతంలో తెగిపోయింది. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే పలు కారణాలతో రిజెక్టు అయింది. ప్రస్తుతం తెగిన గండికి తాత్కాలిక మరమ్మతులు చేపించి దిగువన ఉన్న రైతులకు నీటిని అందిస్తం. శాశ్వత పరిష్కారానికి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తం.
కాలువ తెగినప్పుడల్లా నీళ్లచ్చి ఇంట్ల సొత్తన్నయ్. వరదచ్చి సక్కగ ఇంట్లకు ఉర్కచ్చి సమానంత కరాబైతది. ఆదివారం తెల్లవారేటల్లకు వరద అచ్చింది. ఒక్కన్నే ఉంట. ఈ వరద లకే ఇళ్లు కూలేటట్టుంది. సామాన్లన్నీ తడిసినయ్. అండుకు నేటట్టులేదు, తినేటట్టులేదు. గిట్లుంది పరిషాను. మాకు ఇండ్లిత్తం అన్నరు. మా దిక్కు సూసినోళ్లు లేరు. మళ్లోసరి నీళ్లు రాకుంట సూడాలె.