రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ):ఎటు చూసినా చెత్తాచెదారం. దుర్గంధం వెదజల్లే మురుగుకాలువలు. చినుకు పడితే చిత్తడయ్యే రోడ్లు.. రోడ్లపక్కన లీకవుతున్న తాగునీటి పైపులు. కంపుకొట్టే వీధులు. రోగాల బారిన గ్రామీణులు.. ఇలా మండెపల్లి సమైక్య పాలనలో అరిగోసపడ్డది. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత రూపురేఖలు మార్చుకున్నది. మూడేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘పల్లె ప్రగతి’తో మెరిసింది. కోట్ల నిధులతో సీసీరోడ్లు, మురుగు కాలువలు, ఇంటింటా చెత్త సేకరణ, రహదారులకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లతో ఆహ్లాదభరితంగా మారింది. స్వచ్ఛతలో జాతీయ కీర్తి తెచ్చుకున్న ఆ పల్లెను ప్రతి పల్లే స్ఫూర్తిగా తీసుకుంటున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకొని ఆదర్శంగా నిలుస్తున్నది.
మంత్రి కేటీఆర్ చేయూత, అధికారుల మార్గదర్శనంలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గ సభ్యులు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి సమష్టి కృషి చేశారు. ఐదు విడుతల్లో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. దాదాపు కోటిన్నర వరకు ఖర్చు చేశారు. రోడ్లపైన, మురికి కాలువల్లో ఎక్కడ కూడా చెత్త వేయరాదని నిర్ణయించుకున్నారు. గ్రామ కమిటీలో ఉన్న 15 మంది సభ్యులతో కలిసి ప్రతి రోజు గంట సమయం కేటాయించి సమస్యల జాబితాను రూపొందించుకున్నారు. ఇంటింటా చెత్త సేకరణకు ప్రత్యేక ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి, తడిచెత్త, పొడి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించారు. చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసి హరిత హారంలో నాటిన మొక్కలకు వేస్తున్నారు. పారిశుధ్యం కోసం ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. వీరికి వేతనాలను 8500కు పెంచగా, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు.
నర్సరీలో మొక్కల పెంపకం 2021లో 50వేలు, 21,22లో 20వేలు, 22,23లో 10వేల మొక్కలు పెంచాలన్నది లక్ష్యం కాగా, అందుకనుగుణంగా మొక్కలు పెంచారు. హరిత హారంలో 14వేల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయడమే కాకుండా, వందకు వంద శాతం మొక్కల సంరక్షణకు నడుం కట్టారు. నాటిన మొక్క ఎండి పోతే దాని స్థానంలో మరో మొక్కను నాటడం చేస్తున్నారు. ప్రతిరోజు చెట్లకు నీరు పట్టేందుకు ప్రత్యేక వాటర్ ట్యాంకర్, సిబ్బందిని నియమించారు. స్థలం ఉన్న ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించారు. స్కూళ్లలో విద్యార్థినులు వినియోగించే శానిటరీ న్యాప్కిన్స్ బయట పడేయకుండా ప్రత్యేక ఇన్సినేటర్ మిషన్ 20వేలు పెట్టి కొనుగోలు చేశారు. న్యాప్కిన్స్ ప్యాడ్‌లో మిషన్‌లో వేయగానే బూడిద అవుతాయి. ఊరి ప్రజలకు సాయంత్రం వేళల్లో సేద తీరేలా అహ్లాదాన్ని పంచే పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అందులో అనేక రకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పారిశుధ్యం, పచ్చదనం, మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. శిథిలమైన ఇండ్లు, పిచ్చిమొక్కలను తొలగించుకున్నారు. ఊరంతా స్వచ్చతలో మెరిసేలా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామం నిర్మించారు.
జాతీయ కీర్తి
‘పల్లెప్రగతి’ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులతో ‘మండెపల్లి’ గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్ పల్లె అభివృద్ధిని చూసి పాలకవర్గాన్ని, ప్రజలను అభినందించారు. గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 సంవత్సరానికి జాతీయ అవార్డుకు మండెపల్లి గ్రామాన్ని ఎంపిక చేసింది. ఏప్రిల్ 10న జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటించింది. అవార్డు అందుకున్న సర్పంచ్, పాలకవర్గాన్ని మంత్రులు కేటీఆర్, ఎరవెల్లి దయాకర్‌రావు అభినందించారు.
శభాష్ అనిపించుకున్నాం
ఓరోజు సిటీ నుంచి నా ఫ్రెండ్స్ మా విలేజ్‌కు వచ్చారు. మీఊరిని చూస్తే ఉమ్మివేయడానికి కూడా ఇష్టమనిపించడం లేదన్నరు. ఎందుకలా అన్నారని మస్తు బాధపడ్డా. నేను పుట్టిన ఊరు గింత చండాలంగా ఉందా..? అనుకున్నా. ఎల్ఎల్బీ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉన్నతోద్యోగాన్ని వదులుకుని ఊరికి సేవ చేద్దామని వచ్చిన నాకు ఎదురైన మొదటి చేదు అనుభవం. మాఅన్నయ్య మదన్‌తో కలిసి చర్చించా. ఎలాగైనా ఊరును అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి మాకు కలిసి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటే అందుకు ఆయన స్పందించి నిధుల మంజూరుకి హామీ ఇచ్చారు. అధికారులు చెప్పిన విధంగా చేపట్టిన అన్ని పనులను పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో వందకు వంద శాతం పూర్తి చేశాం. నాడు ఈసడించుకున్నోళ్ల చేతనే శభాష్ అనిపించుకున్నాం. స్వచ్ఛతలో మెరిసేలా జాతీయ అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నా. మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. పాలకవర్గానికి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా సహకరించినందుకు ధన్యవాదాలు.
– గనప శివజ్యోతి సర్పంచ్
పల్లె ప్రగతి అద్భుతం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతం. జిల్లాలోని అన్ని పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టించింది. ముఖ్యంగా మండెపల్లి గ్రామంలో చేపట్టిన ప్రగతి పనులన్నీ వందకు వంద శాతం అమలయ్యాయి. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో సర్పంచ్, పాలకవర్గం, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో పనులు పూర్తయ్యాయి. పారిశుద్ధ్యం చాలా మెరుగు పడింది. సీసీరోడ్లు, విద్యుత్ దీపాలు, మురికి కాలువలు నిర్మించడం జరిగింది. ఇంటింటా చెత్త సేకరించి సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం ఇలా అన్ని అంశాలలో మండెపల్లి స్వచ్ఛతలో అగ్రబాగాన నిలిచి జాతీయ అవార్డును దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం.
– యెనగందుల రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి (రాజన్నసిరిసిల్ల)